Robbery in ATM – Godavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఏటీఎంలు ధ్వంసం చేశారు. ఒకదాంట్లో నగదు దొంగలించారు. మరో దాంట్లోని నగదు చోరీ చేసేందుకు యత్నంచారు. అయితే, కొద్ది నిమిషాల తేడాతో జరిగిన ఈ రెండు దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
పోలీసుల కథనం ప్రకారం..మంచిర్యాల (Mancherial) జిల్లా నుంచి గంగానగర్‌లోకి శనివారం తెల్లవారుజాము 1.30 గంటల ప్రాంతంలో ఓ కారు ప్రవేశించింది. కారులో మొత్తం నలుగురు ఉండగా.. అందులోంచి ఒకరు ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న ఏటీఎంలో చొరబడ్డాడు. తొలుత సీసీ కెమెరాలపై కలర్ స్ప్రే చేశాడు. అనంతరం షెట్టర్ మూసివేశాడు. ఏటీఎం మీషన్ ముందు డోర్ ఊడగొట్టాడు. పోలీసుల పెట్రోలింగ్ సైరన్ రావడంతో వెంటనే పరారైయ్యారు. సొమ్ము చోరీకి గురికాలేదని పోలీసులు తెలిపారు.
Also Read: మంత్రి రోజా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్.. సింహంతో కాదు దీంతో పోల్చుకోండి: పృథ్వీరాజ్
అయితే, గంగానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసిన దుండగులు..మళ్లీ ముఖాలకు మాస్క్‌లు ధరించి అదే కారులో గౌతమినగర్ హనుమాన్ ఆలయం వద్ద గల ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. వచ్చీరాగానే వెంటనే ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్నో స్ప్రే చేశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం మెషన్ ముందుభాగం కట్ చేశారు. అందులోని సుమారు రూ.27 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. ఘటన స్థలంను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాసరావు పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు మూడు పోలీసు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హిటాచీ నిర్వాహకుడు గాండ్ల రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.