సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు నదిలో దూకారు. పోలీసులు కూడా నదిలోకి దూకి వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు జార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకున్నాయి.
గత కొంతకాలంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. డ్యూటీలో కాకుండా సాధారణ పౌరులు లాగా వారు కూడా ప్రవర్తించడం మొదలు పెట్టిన క్రమంలో ఆరుగురు అనుమానితులు ఓ నది తీరం వద్ద తారసపడ్డారు.
వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అంతే ఆ నిందితులు ఒక్కసారిగా బరాకర్ నదిలోకి దూకేశారు. పోలీసులు ఏమన్నా తక్కువ తిన్నారా వారు కూడా నదిలోకి దూకి నిందితులను వెంబడించి, వారిని పట్టుకుని నదికి అవతలి తీరానికి లాక్కొని వచ్చి మరీ అరెస్ట్ చేశారు.
వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 8 లక్షలకు పైగా నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్ కార్డులు, 12 పాస్ బుక్‌లతో పాటు కొన్ని పాన్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే సైబర్ మోసగాళ్లు పలువురికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా గర్భిణిలను లక్ష్యంగా చేసుకుని న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
Also read: హాయ్ నాన్న చూసిన బన్నీ..మూవీ గురించి ఏమన్నారంటే!