Rinku Singh Smashes 3 Consecutive Sixes: టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. నయా సిక్సర్లు వీరుడిగా అవతరిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రింకూ పేరు మార్మోగిపోతుంది. తన దూకుడైన ఆటతో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్న రింకూ.. ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపి భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న యూపీ టీ20లీగ్(UP T20 League) లోనూ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో భాగంగా కాశీ రుద్రస్, మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన కాశీ జట్టు కూడా 181 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ జరిగింది.
ఈ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన కాశీ రుద్రస్ 16 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన మీరట్ జట్టుకు రింకూ సింగ్ స్ట్రైకింగ్ చేశాడు. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. శివమ్ సింగ్ వేసిన తొలి బంతిని డాట్ బాల్ ఆడిన రింకూ.. తర్వాత మూడు బంతులను మూడు సిక్సర్లు కొట్టి రెండు బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయం అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల రింకూ సింగ్ ఈజ్ సిక్సర్ల కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) దొరికాడు అని పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ నెలలో జరిగే ఆసియా గేమ్స్‌లో ఇండియా జట్టులో రింకూ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Palak na jhapke 😴 nahin toh miss hojayenge #RinkuSingh 🔥 ke zabardast 6⃣6⃣6⃣#AbMachegaBawaal #JioUPT20 #UPT20onJioCinema pic.twitter.com/vrZuMqPn9D
— JioCinema (@JioCinema) August 31, 2023
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ రింకూ సింగ్ స్వస్థలం. ఉత్తరప్రదేశ్ అండర్-16, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన రింకూ.. అండర్-19 స్థాయిలో సెంట్రల్ జోన్ తరఫున ఆడాడు. 2014లో యూపీ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2016-17 రంజీ సీజన్లో యూపీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018-19 రంజీ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 953 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సమయంలో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టి రింకూ పైన పడింది. తొలిసారిగా కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టు వేలంలో రింకూను దక్కించుకుంది. అప్పటి నుంచి మనోడి భవిష్యత్ మారిపోయింది.
Also Read: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే