ఎంతో ఉన్నతమైన న్యాయ వృత్తిలో ఉన్న ఓ మహిళా న్యాయవాది(Lawyer) భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. రేణు సిన్హా (61) అనే న్యాయవాది సుప్రీం కోర్టులో న్యాయవాది (Supreme court lawyer) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయినట్లు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంటి బాత్రూమ్ లోనే కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా(61) తన భర్త నితిన్ నాథ్ సిన్హా తో కలిసి ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో సెక్టార్ 30 లోని బంగ్లాలో ఉంటున్నారు.
అయితే రెండు రోజుల నుంచి ఆమె ఫోన్ తీయడం లేదని, కనీసం బయటకు రావడం లేదని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. అయితే ఇంటి మొత్తం గాలించగా రేణు ఆమె ఇంటి బాత్రూమ్ లో శవమై కనిపించారు.
అయితే ఆమె మరణం వెనుక ఆమె భర్తే ఉండి ఉంటాడని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. వారిద్దరి మధ్య చాలా కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలో అతనే తన సోదరిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు తెలిపాడు. అయితే రెండు రోజుల నుంచి ఆమె భర్త కూడా కనిపించడం లేదని ఆయన పోలీసులకు తెలపడంతో వారు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ఆయన ఫోన్ సిగ్నల్స్ చివరిగా వారి బంగ్లా వద్దనే చూపించాయి.దాంతో ఇళ్లంతా జల్లెడ పట్టగా నిందితుడైన నితిన్ వారి బంగ్లా స్టోర్ రూంలో దాక్కొని ఉన్నారు. పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అయితే నితిన్ స్టోర్ రూమ్ లోనే సుమారు 36 గంటల పాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయనను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నితిన్ భార్యను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.