గం..గం..గణేశా అనేది అందరికీ తెలిసిందే. ఆనంద్ దేవరకొండ సినిమా పేరు కూడా ఇదే. కాకపోతే ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాను “గన్..గన్” గణేశా అని చెప్పుకోవాలేమో. ఊహించని విధంగా తుపాకులు పట్టుకొని రెడీ అయ్యాడు ఆనంద్ దేవరకొండ.
“బేబీ” సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం “గం..గం..గణేశా” అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నాడు.
“గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న”గం..గం..గణేశా” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకొని, నవ్వుతూ కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ – ఫన్ – గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది.
మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం “గం..గం..గణేశా” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.