Tollywood Films Re Release: ఇప్పుడు తమ ఫేవరెట్ స్టార్ హీరోల పాత హిట్ సినిమాల్ని మరోసారి థియేటర్ లో చూసే అవకాశం అందరికీ కలుగుతోంది. కొత్త సినిమా కోసం ఎదురుచూసేబదులు సూపర్ హిట్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి ఆనందిస్తున్నారు.
Mahesh Babu:
మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలతో ఈ రీ-రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ముందుగా పోకిరి సినిమాను రీ-రిలీజ్ చేశారు. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మహేష్ నటించిన ఒక్కడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాల్ని కూడా రీ-రిలీజ్ చేశారు. వీటిలో బిజినెస్ మేన్ మూవీ, రీ-రిలీజ్ లో కూడా రికార్డ్ సృష్టించింది. రీ-రిలీజ్ లోఅత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
Balakrishna:
మహేష్ బాబు తర్వాత రీ-రిలీజ్ ట్రెండ్ లో జోరు చూపించిన హీరో బాలకృష్ణ . నటసింహం నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో పాటు.. అతడి కెరీర్ లో క్లాసిక్స్ గా నిలిచిన భైరవద్వీపం లాంటి మూవీస్ మరోసారి థియేటర్లలోకొచ్చాయి. బాలయ్య కెరీర్ లో ఫ్లాప్స్ గా నిలిచిన పల్నాడు బ్రహ్మనాయుడు లాంటి సినిమాల్ని కూడా రీ-రిలీజ్ చేయడం విశేషం.
Chiranjeevi
చిరంజీవి నుంచి కూడా ఈ తరహా చిత్రాలున్నాయి. చిరు నటించిన ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. బాలయ్యతో పోలిస్తే, చిరంజీవి నుంచి రీ-రిలీజ్ ల సంఖ్య తక్కువగానే ఉంది. త్వరలోనే మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.
Pawan kalyan
రీ-రిలీజ్ విభాగంలో అందరికంటే ఎక్కువ మూవీస్ పవన్ కల్యాణ్ ఖాతాలో ఉన్నాయి. పవన్ కెరీర్ లో సూపర్ హిట్టయిన సినిమాలన్నీ దాదాపు రీ-రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ లో క్లాసిక్ గా చెప్పుకునే తొలిప్రేమ నుంచి ఖుషి, తమ్ముడు, సుస్వాగతం లాంటి చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. త్వరలోనే గబ్బర్ సింగ్ కూడా రాబోతోంది.
NTR
టాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఇతడు నటించిన ఎన్నో సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆశ్చర్యంగా రీ-రిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్-దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి మూవీ అప్పట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. రీ-రిలీజ్ లో 4 కోట్లు 60 లక్షల గ్రాస్ రాబట్టింది.
Prabhas
హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ నటించిన చాలా సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అనుష్కతో కలిసి చేసిన బిల్లా, మిర్చి సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఛత్రపతి కూడా మరోసారి థియేటర్లలోకి వచ్చింది. బాహుబలి మాత్రం ఇంకా రాలేదు. త్వరలోనే యోగి సినిమా రాబోతోంది.
Allu Arjun
అల్లు అర్జున్ నుంచి ఇప్పటివరకు కేవలం 3 సినిమాలు మాత్రమే వచ్చాయి. వీటిలో ఒకటి ఆర్య సినిమా. సుకుమార్ ను దర్శకుడిగా పరిచయం చేసిన ఈ సినిమా రీసెంట్ గా మరోసారి థియేటర్లలోకి వచ్చింది. వీటితో పాటు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన దేశముదురు, కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన హ్యాపి సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి.
Nagarjuna
త్వరలోనే నాగార్జున నుంచి మన్మధుడు సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే నాగార్జున నుంచి శివ, గీతాంజలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన్మధుడు సినిమా తర్వాత నాగ్ నుంచి మరిన్ని మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. లిస్ట్ లో అన్నమయ్య సినిమా రెడీగా ఉంది.
ఇవే కాకుండా…
టాలీవుడ్ హీరోల సినిమాలతో పాటు కొన్ని స్పెషల్ మూవీస్ కూడా రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్య సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రిలీజైంది. తెలుగులో ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా సూర్య షాక్ అయ్యాడంటే, రీ-రిలీజ్ లో ఈ సినిమాకు వచ్చిన స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ధనుష్ నటించిన రఘువరన్ బీ-టెక్ కూడా మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులో ధనుష్ కు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన సినిమా ఇది. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్టయింది. రీ-రిలీజ్ లో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ నగరానికి ఏమైంది సినిమాను కూడా రీ-రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ రీ-రిలీజ్ లో మాత్రం దీనికి కల్ట్ స్టేటస్ వచ్చింది. యూత్ పిచ్చపిచ్చగా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. త్వరలోనే మరిన్ని సినిమాలు ఈ కోవలో రీ-రిలీజ్ అవ్వబోతున్నాయి.
Also Read: వీకెండ్ మజాకు రెడీనా.. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే