India Post GDS Recruitment: 30వేలకు పైగా పోస్టులు..
భారత పోస్టల్ శాఖ కొలువులు జాతర కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 52వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా 30వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో దాదాపు వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న 30వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 23వరకు indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.
పది మార్కుల ఆధారంగా నియామకాలు..
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానికభాష కచ్చితంగా చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. BPM పోస్టులకు రూ.12వేలు నుంచి రూ.29,380 వేతనం ఉండగా… ABPM పోస్టులకు రూ.10వేలు నుంచి 24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫీజు రూ.100గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలంటే?
మొత్తం 30,041 పోస్టులకు గాను ఏపీలో 1058, తెలంగాణలో 961 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ఇన్సెంటివ్ ఉంటుంది. రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలాశాఖ సమాకూరుస్తుంది. అయితే సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.
How to Apply for India Post GDS Recruitment – దరఖాస్తు ఎలా చేయాలి?
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా indiapostgdsonline.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీపై కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి.
వ్యక్తిగత వివరాలతో దరఖాస్తును నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
అనంతరం ఫీజు చెల్లించాలి. చివరగా దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.