మీరు ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటి చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియపై చాలా మంది అభ్యర్థుల్లో డౌట్స్ ఉన్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు ఈ నెల 10 చివరి తేదీ. 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారులను, అభ్యర్థులను ఆదేశించింది.
అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్:
➼ అభ్యర్థి తన అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వేయవచ్చు.
➼ అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలి.
➼ నేరాల వివరాలను మూడు దఫాలు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలి.
➼ ఒకవేళ అభ్యర్థి జైలులో ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేయాలి.. వారి ధ్రువీకరణతో డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది.
➼ ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అభ్యర్థి పత్రాలను RO(రిటర్నింగ్ అధికారి)కి అందజేయాలి.
➼ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థుల కాన్వాయ్‌లో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
➼ ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత వివరాలను నామినేషన్ పత్రాలతో పాటు నామినీలు సమర్పించాల్సి ఉంటుంది.
➼ అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి.
➼ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలు చేయడానికి ఒక రోజు ముందు కొత్త బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలి. ఈసీ(EC)కి ఇది చెప్పాలి. అభ్యర్థి తన ఖర్చును కొత్త బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించాలి.
➼ నామినేషన్ పరిశీలన సమయంలో అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొచ్చు. లాయర్‌ను కూడా తీసుకెళ్లవచ్చు.
నామినేషన్ల ప్రారంభం – నవంబర్ 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – నవంబర్ 15
పోలింగ్ – నవంబర్ 30
ఫలితాలు – డిసెంబర్ 3
సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించింది.
Also Read: బండిపై ఈటల పైచేయి సాధించారా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?