Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం (Municipal Council Meeting) ఇద్దరు అధికారులు కొట్టుకోవడానికి వేదికైంది. సభ్యులందరి సమక్షంలో కమిషనర్ నామా కనకారావు, డీఈ భవానీ శంకర్ లు బాహాబాహీకి దిగటంతో కలకలం రేగింది. శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కాగా.. తొలుత కౌన్సిలర్ బోను దేవా మాట్లాడుతూ…ఇంజినీరింగ్ విభాగాన్ని ఎవరు చూస్తున్నారు? డీఈ భవానీ శంకర్ పని చేస్తున్నారా..లేదా అని ప్రశ్నించారు.
దానికి కమిషనర్ జవాబుగా ఎన్నికల సమయంలో డీఈ తనకు చెప్పకుండా లాంగ్ లీవ్ కు దరఖాస్తు చేయడంతో కలెక్టర్ వద్ద సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మే 15న డీఈ కోర్టు ఆర్డర్ తెచ్చుకుని విధుల్లో చేరినప్పటికీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.
దీంతో పనులు ఈఈ హుస్సేన్ తో చేయించుకుంటున్నట్లు తెలిపారు. దానికి డీఈ భవానీ శంకర్ స్పందిస్తూ..కమిషనర్ తన పై కక్ష సాధిస్తున్నందుకే సెలవు పై వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా అసభ్య పదజాలంతో ఒకరికొకరూ దూషించుకొంటూ కొట్టుకున్నారు.
దీని గురించి కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగుల ముందు, కాంట్రాక్టర్ల ముందు డీఈ తనను చులకన చేస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. డీఈగా తాను ఉండగా ఈఈ తో పనులు చేయించుకోవడం ఏంటని..దీని గురించి కోర్టుకు వెళ్తానని తెలిపారు. ఎనిమిది నెలలుగా తనకు జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈ క్రమంలో మున్సిపల్ డీఈ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ ప్రజారోగ్య శాఖ ఈఎస్సీ గోపాలకృష్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ షాన్ మోహన్ కు ఉత్తర్వులు పంపారు.
Also Read: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం ఎమ్మెల్యే!