ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సులకు ప్రవేశపరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 6 పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కొన్ని పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అందులో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, పీజీఈసెల్ పూర్వ కన్వీనర్ రవీంద్రారెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుండగా…వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించినట్లయితే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తున్నారు. పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉండటం, ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతో ఈ దిశగా అడుగులేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.
కాగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్షా విధానం మార్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్స్ కు బదులుగా రాతపరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ రాజేశ్ లు సభ్యులుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఏముంది మావ ఆ కారులో అంత స్పెషల్…దాని కోసం లక్ష మంది వెయిటింగ్..!!