చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని యావత్ భారత్ మొత్తం కోరుకుంటోంది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడంతో మిషన్ లో మనం సగం విజయాన్ని సాధించినట్టు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన పని మొదలవుతుంది. ఒక లూనార్ డే(భూమిపై 14 రోజులు) వరకు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా పనిచేయనున్నారు.
విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయ్యాక ఏం జరుగుతుంది…!
చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయ్యాక కొద్ది సేపటికి ల్యాండర్ లోని ఒక సైడ్ ప్యానెల్ తెరుచుకుంటుంది. దీంతో ల్యాండర్ లోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆరు చక్రాలు గల రోవర్ పై భారత జాతీయ పతాకంతో పాటు ఇస్రో లోగో వుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
రోవర్ ఏం చేయనుంది…!
చంద్రునిపైకి దిగిన తర్వాత రోవర్ సెకనుకు 1 సెంమీ వేగంతో అటు ఇటు తిరుగుతుంది. రోవర్ పై ప్రత్యేకమైన నావిగేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చంద్రుని పై తిరుగుతున్న సమయంలో అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా రోవర్ ఫోటోలు తీస్తుంది. దీంతో పాటు చంద్రునిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, ఇస్రో లోగోను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. రోవర్ లో ఉన్న పరికరాలు ప్రత్యేక పేలోడ్ తో కాన్ఫిగర్ చేయబడి వున్నాయి.
ల్యాండర్ ఏం చేస్తుంది….!
రోవర్ పేలోడ్స్ ద్వారా చంద్రుని ఉఫరితలానికి చెందిన డేటాను మొదట ల్యాండర్ కు అందజేస్తుంది. ఈ మూడు పేలోడ్స్ తో చంద్రుని ఉపరితల ఉష్ణ ధర్మాలు, చంద్రునిపై ఉన్న క్ట్రస్ట్, మ్యాంటిల్ నిర్మాణాన్ని ఇది వివరించనుంది. సుమారు రెండు వారాల పాటు ల్యాండర్, రోవర్లు చంద్రునిపై పరిశోధనలు జరపనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. రోవర్ నుంచి సమాచారం ల్యాండర్ కు అక్కడి నుంచి ఇస్రోకు సమాచారం అందుతుందన్నారు.
ల్యాండర్, రోవర్ జీవిత కాలం…!
ల్యాండర్, రోవర్ జీవిత కాలం 1 లునార్ డే వుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక లునార్ డే అంటే భూమిపై 14 రోజులకు సమానం. ఆ 14 రోజుల గడిచిన తర్వాత ల్యాండర్, రోవర్ లోని సోలార్ ప్యానెల్స్ కు సౌర శక్తి అందుకునే సామర్థ్యాన్ని కోల్పుతుందని చెబుతున్నారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలాన్ని మరో లూనార్ డే కు పొడిగించే అవకాశం కూడా ఉందన్నారు. అయితే దాని కోసం చంద్రునిపై వాతావరణాన్ని పరిశీలించాలని, అక్కడి ఉష్ణోగ్రతలకు ల్యాండర్, రోవర్ లు తట్టుకుని ఉన్నాయా లేదా అనే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని దానిపై నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందన్నారు.