ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురందించింది. ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూపీఎస్సీ, ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చించి…జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రోత్సాహకం అందించనున్న ఏపీ సర్కార్:
యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన సామాజిక, ఆర్థిక విద్యాపరంగా వెనకబడిన తరగతుల అభ్యర్థులకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పేరుతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారికి రూ. లక్ష మెయిన్స్ లో అర్హత సాధిస్తే మరో రూ. 50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది.
ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ఐటీ కొలువులు.. 26న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!!
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టంలోని సవరణ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికెట్ అందేలా ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం 2016కి సవరణల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న ప్రైవేట్ వర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే వాటికి జాయింట్ సర్టిఫికేట్ ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న ప్రైవేట్ కళాశాలలు , విశ్వవిద్యాలయాలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం కన్వీనర్ కోటా కిందకు రానున్నాయి.
ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారానే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చట్టం 2017 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కురపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 50శాతం సీట్లు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ విద్యార్థులకే కేటాయించే విధంగా తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక నుంచి పాఠశాలలో ఐటీ సిలబస్:
ఇక నుంచి పాఠశాల స్థాయి నుంచే ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ ను అమలు చేయనున్నట్లు కేబినెట్ తెలిపింది. ఈ మేరకు ఐబీతో విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కి ఆమోదం తెలిపింది. 1వ తరగతి నుంచి ప్రారంభించి తర్వాత మిగిలిన తరగతులకు విస్తరిస్తారు.