తెలంగాణా ప్రభుత్వం మహిళా సాధికారతకు చర్యలు చేపడుతోంది. వారిని విజ్ఞాన వంతులుగా మలచే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా మహిళా లైబ్రరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లా రాంనగర్ కేంద్రంగా లేడీస్ లైబ్రరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు.ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో అక్షరం అల్లుకుంటుంది. ఆకుటుంబం అభివృద్ధివైపు అడుగులు వేస్తుంది. అందుకే ఎంతో మంది సంఘసంస్కర్తులు మహిళా విద్యను ప్రోత్సహించారు.
అందర్నీ అందరి చేతులను సెల్ ఫోన్ ఆక్రమిస్తోంది. టీవీ, సినిమా, ఓటీటీ, గేమ్స్, ఆన్లైన్ షాపింగ్.. చాలా మంది న్యూస్ పేపర్ సైతం సెల్ ఫోన్ లోనే చూస్తున్నారు. ఇలా ప్రతి విషయానికీ సెల్ ఫోనే కేంద్రంగా మారిపోయింది.
స్కూలు పిల్లల చేతుల్లో తప్ప పెద్దల చేతిలో పుస్తకం కనీసం కంటిచూపునకు కూడా నోచుకోవటం లేదు. పుస్తక పఠనం పూర్తిగా అదృశ్యం అయిపోయింది. అన్నీ మొబైల్లోనే లభించే అవకాశాన్ని సాధించడం మనిషి సాధించిన సాంకేతిక ప్రగతి ఓ వైపు ..మరోవైపు దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే
చూపు మందగించడం,ప్రతి చిన్న విషయానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటంతో జ్ఞాపక శక్తిలోపించడం, డిజిటల్ స్క్రీన్ నుంచి వెలువడే రేడియేషన్, దీంతోపాటు పలు శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఫోన్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఓవిధంగా చూస్తే మొబైల్ వల్లే కలిగే ప్రయోజనాలు తాత్కాలికంగాను, దాని వల్ల వచ్చే అనర్థాలు పర్మినెంట్ గాను ఉన్నాయి.డిజిటల్ తో పాటు.. జ్ఞానానికి మాన్యువల్ రూపమైన పుస్తకం బతకాలి,బతికించాలి పురోగమించాలనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం ఈ మహిళా విజ్ఞాన విధానాన్ని, మరుగున పడుతున్న గ్రంథాలయాలను తెరమీదికి తీసుకువచ్చింది.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలో పుస్తక పఠనంతో పాటు..పూర్తిగా వైఫై కనెక్టివిటీతో డిజిటల్ లైబ్రరీలను కూడా ప్రోత్సహించడం అభినందించాల్సిన విషయం. అయితే, ఇప్పటివరకూ మనం చూసిన ఎన్నో లైబ్రరీలు కేవలం మగవారు మాత్రమే స్వేచ్ఛగా వెళ్లి చదువుకునేలా ఉండేవి.
కానీ, అందుకు భిన్నంగా ఇప్పుడు మహిళల కోసం కూడా ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా రాంనగర్ కేంద్రంగా..మొట్టమొదటిసారి మహిళా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ప్రగతి శీల అంశం.
ఈ లైబ్రరీకి ఇప్పుడు చుట్టుపక్కల మహిళలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మహిళలకు కావల్సిన అన్ని వసతులతో పాటు.. సావిత్రీభాయి పూలే, సరోజిని దేవీ, కల్పనా చావ్లా నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, సూపర్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవీ వరకు ఎన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు..మహిళలను ఆకట్టుకునే వంటలు, కుట్లు, అల్లికలు, గార్డెనింగ్, ఆరోగ్య సూత్రాలు, బ్యూటీషియన్ బుక్స్ తో పాటు..నవలలు, చారిత్రక పుస్తకాల వంటివీ ఉంచడంతో చాలామంది మహిళలు.. తమ కుటుంబ పనులు ముగించుకుని కరీంనగర్ లో లైబ్రరీ బాట పట్టడం.. మహిళా సాధికారతకు ఇది మరోమొట్టుగా భావించవచ్చు.
పిల్లలు,వారి చందువులు,ఇంటి పని,వంటపని వగైరాలు బాధ్యతలు మహిళలు తప్పించుకోలేని అంశాలు.కాస్త తీరిక దొరికితే కాలక్షేపం కోసం సీరియల్స్ చూస్తారన్నమాట కాదనలేని వాస్తవమే అయినా వారికి ఎంటర్ టైన్ ఇచ్చేవాటిలో సీరియల్స్ ప్రధాన భూమిక పోషిస్తోంది. వాటి స్థానంలో పుస్తకం చేరితే స్త్రీ మరింత విజ్ఞాన సంపన్నమవుతుంది తద్వారా ఆయాకుటుంబాలు ప్రగతిబాటన నడుస్తాయి.
ఈ నేపథ్యంలో మొట్టమొదటి మహిళా లైబ్రరీని కరీంనగర్ వేదికగా ప్రారంభించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని గ్రామగ్రామానికీ విస్తరించాలనుకుంటోంది. కరీంనగర్ లో ప్రస్తుతం మహిళాసంఘ భవనంలో నిర్వహిస్తున్న ఈ లైబ్రరీని.. ఐదు గదులతో.. పూర్తి స్థాయి ఫర్నీచర్ తో కోటి ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.
ప్రతీనెలా వార్తాపత్రికలు, ఇతర మ్యాగజైన్స్ కోసం ప్రతీ రీడింగ్ రూమ్ కు ఒక రెండు వేల బడ్జెట్ నూ కేటాయిస్తున్నారు. ఇదే పద్ధతిలో గ్రామాల్లో గ్రామపంచాయతుల ఆధ్వర్యంలో ఇలాంటి మహిళా ఓపెన్ లైబ్రరీస్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.