ఆస్తులు ఇవ్వలేదనో, బంగారం కొనివ్వలేదనో, అత్తమామలు,ఆడపడుచులతో పడడం లేదనో…భర్తతోనే విసిగిపోయో విడాకులకు ఆప్లై చేసేవారిని మనం నిత్యం ఏదోక సందర్భంలో చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇల్లాలు 5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది.
ఈ జంటకు గతేడాదే పెళ్లి అయ్యింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. భార్యకు పెళ్లైన మొదట్లో అడగకుండానే అన్ని కొని తీసుకుని వచ్చేవాడు. ఆ క్రమంలోనే ఆమెకు ఎంతో ఇష్టమైన కుర్కేరేను రోజు తీసుకుని వచ్చేవాడు. దీంతో ఆమెకు సంవత్సర కాలంగా కుర్కేరే తినడం బాగా అలవాటు అయ్యింది.
అయితే గత కొంత కాలం నుంచి భర్త ఎలాంటి స్నాక్స్ ఇంటికి తీసుకురావడం లేదు. దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోంది. ఐదు రూపాయల కుర్కురే కోసం భర్తతో భార్య గొడవ పడుతుంది. ఎంత చెప్పినా స్నాక్స్ తీసుకురావడం లేదని విసుగెత్తిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా భర్తకు విడాకుల నోటీసు పంపించింది.
ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తన భార్య పోరు భరించలేకపోతున్నానని.. రోజూ కుర్కురే తీసుకురావాలని గొడవ చేస్తుందని బాధితుడు పోలీసుల ముందు చెప్పి బోరుమన్నాడు. దీంతో భార్యాభర్తలిద్దరినీ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. కుటుంబ సలహా కేంద్రం వారు.. జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరిలో మార్పు కనిపించలేదు. మరోసారి రావాలని పోలీసులు ఇంటికి పంపించారు. ఇంతలోనే ఆమె విడాకులకు అప్లై చేసింది.
భార్యాభర్తల మధ్య గొడవకు ఐదు రూపాయల కుర్కురే కారణమని పోలీసులు తెలిపారు. ఆమెకు కుర్కురే అంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. పెళ్లైన కొత్తలో భర్త.. రోజూ తెచ్చేవాడని.. ఇప్పుడు తీసుకురాకపోవడం వల్లే సంసారంలో గొడవలు మొదలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ జంటకు 2023లో వివాహం అయిందని వెల్లడించారు.
Also Read: బద్రీనాథ్, కేదార్నాథ్కు హెలికాప్టర్లో వెళ్తే ఎంత ఖర్చవుతుంది? పూర్తి వివరాలు ఇవే!