తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ..పార్టీకి అనుకోని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కి తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో ఉన్న తనకు అన్ని విధాలుగా సహకరించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలను మాత్రం ఏనాడు పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.
పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసిన లేఖను సీఎంకి ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రియాంక గాంధీ సభలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ను విడిచి పెట్టి బీఆర్ఎస్ లో చేరినట్లుగా తెలిపారు.
Also read: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే!
బీఆర్ఎస్ లో చేరిన తరువాత ఏనాడూ సీఎం ఎప్పుడూ కూడా తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. పార్టీకి మాత్రమే కాదు…ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే పదవికి రాజీనామా చేయాలా వద్ద అనే విషయం గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటున్నానని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.
ఒక్క పార్టీ నుంచి వచ్చిన పదవిని మరో పార్టీలో చేరినప్పుడు వదిలేసుకోవాల్సి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఎలా చెబితే ఆ సూచనలను కూడా తీసుకోని దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కి వరుస షాక్ లు తగులుతున్నాయి.
Also read: షావర్మా తినడం వల్ల మరణించిన యువకుడు..ఎక్కడంటే!
ఈ నెల మొదట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లోనే చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుండి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి టిక్కెట్టును కేటాయించింది.