International Yoga Day 2024: శ్రీనగర్‌లో జూన్ 21 న జరగనున్న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు . శ్రీనగర్‌లోని (Srinagar) షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ “యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ” . ఢిల్లీలో ఈరోజు (జూన్ 18)మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ (Prataprao Jadhav), ఈ ఏడాది థీమ్ వ్యక్తిగత -సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా పాత్రను హైలైట్ చేస్తుంది అని చెప్పారు. యోగా శారీరక, మానసిక – ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుం దనీ, సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుందనీ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొనడం సమాజాలపై యోగా తీవ్ర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిలో సాధారణ యోగా ప్రోటోకాల్ పుస్తకాన్ని జాదవ్ విడుదల చేశారు. ఇది దృష్టి లోపం ఉన్నవారు యోగా నేర్చుకోవడానికి – సాధన చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రొఫెసర్ ఆయుష్మాన్ యోగాపై కామిక్‌ను కూడా విడుదల చేశారు. ఈ పుస్తకం పిల్లలు ఆసక్తితో – వినోదంతో యోగా నేర్చుకోవడానికి, సాధన చేయడానికి సహాయపడుతుంది.
Also Read: అంతర్జాతీయ భయాందోళన దినోత్సవం.. లక్షణాలు, నివారణలు
అంతేకాకుండా.. ఈ సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణ యోగా ప్రోటోకాల్ మార్గదర్శకాల ప్రకారం ఇస్రోలోని శాస్త్రవేత్తలు,అధికారులందరూ కలిసి యోగా చేస్తారు. గగన్ యాన్ యోజన బృందం ఈ సందర్భంగా యోగా సాధన చేయడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ ప్రచారంలో చేరనుంది.
యోగా రంగంలో సాంకేతికత, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ MyGov పోర్టల్, MyBharat పోర్టల్‌లో యోగాటెక్ ఛాలెంజ్‌ని నిర్వహించింది. యోగా సంబంధిత సాధనాలు, సాఫ్ట్వేర్, పరికరాలను అభివృద్ధి చేసిన స్టార్టప్‌లు-వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం దీని లక్ష్యం.
International Yoga Day 2024 Theme: Yoga for Self and Society