భారత స్వాతంత్ర్య వేడుకలను ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులకు కేంద్రం ఆహ్వానం పంపింది. జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా ఈ సారి వేడుకలకు సుమారు 1800 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం పంపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో అతిథులు, రాజకీయ ప్రముఖులు, వేడుకలకు హాజరయ్యే సామాన్య ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
1800 మంది అతిథులు…!
ఈ సారి వేడుకలకు వైబ్రెంట్ విలేజ్ లకు చెందిన సర్పంచ్ లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల పథకానికి చెందిన ప్రతినిధులు, ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనా, శ్రమ యోగీలు(నిర్మాణ రంగం కార్మికులు), ఖాధీ పనివారు, సరిహద్దు రహదారుల నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఇలా పలు రంగాలకు చెందిన వారికి ఆహ్వానాలు పంపారు.
ప్రత్యేక సెల్ఫీ పాయింట్స్…!
వేడుకల్లో భాగంగా ఈ నెల 15 నుంచి 20 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై గవర్నమెంట్ పోర్టల్ లో ఆన్ లైన్ సెల్ఫీ కాంటెస్ట నిర్వహించనున్నారు. వేడుకల్లో పాల్గొన్న పౌరులు ఒకటి లేదా మొత్తం 12 సెల్పీ పాయింట్స్ వద్ద ఫోటోలు తీసుకుని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఒక్కో సెల్ఫీ పాయింట్ వద్ద ఒక్కొక్కరి చొప్పున మొత్తం 12 మంది విజేతలను ప్రకటించనున్నారు. వారికి రూ. 10,000 నగదు బహుమతిని ప్రకటించనున్నారు.
డీపీ చేంజ్ చేసిన మోడీ…!
ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాలకు చెందిన ప్రొఫైల్ పిక్ లను చేంజ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన తిరంగా జెండాను తన డీపీగా పెట్టుకున్నారు. దేశ పౌరులంతా తమ సోషల్ మీడియా ఖాతాలకు మువ్వన్నెల జెండాను డీపీగా పెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వినూత్న ప్రయత్నానికి దేశ ప్రజలు సహకరించాలని కోరారు.