Priyanka Gandhi: అది జనవరి 11, 1998. సోనియా గాంధీ (Sonia Gandhi) రాజకీయ రంగప్రవేశం చేసిన రోజు. అంతకముందు సరిగ్గా ఏడేళ్ల క్రితం తన భర్త రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్యకు గురయ్యారు. రాజీవ్ చనిపోయిన తమిళనాడు-శ్రీపెరంబుదూర్ నుంచే సోనియా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఈ ర్యాలీలో అందరిచూపు సోనియాపై ఉండాలి కానీ.. అక్కడున్నవారంతా సోనియా కంటే ఎక్కువగా ఒక 26ఏళ్ల అమ్మాయిపైనే చూపు పెట్టారు. ఆమెనే సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ.
ఎరుపు చీరలో కనిపించిన ప్రియాంక నాటి సభలో తమిళంలో కేవలం ఒక లైన్ మాత్రమే మాట్లాడారు. ‘ఎల్లూరు కాంగ్రెస్‌కు ఓటు పొదుంగల్’ అని ప్రియాంక అక్కడి ప్రజల్ని ఉర్రూతలూగించారు. దీని అర్థం ‘మీరంతా కాంగ్రెస్‌కే ఓటు వేయండి’ అని..! దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ‘అవర్ ఫ్యూచర్ లీడర్.. అవర్ ఫ్యూచర్ లీడర్’ అని నినాదాలు చేశారు. అయితే ఇది నిజమవడానికి ఆ తర్వాత 26ఏళ్లు పట్టింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ను నింపింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండిటిలోనూ విజయం సాధించారు. గాంధీ కుటుంబం కంచుకోట రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయానడ్ నుంచి రాహుల్ పోటి చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో వయానడ్ సీటును వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటి చేయనుంది. 52వ ఏట ప్రియాంక గాంధీ నేరుగా రాజకీయ బరిలోకి దిగుతుండడం విశేషం. అది కూడా దక్షిణాది నుంచి ఆమె పోటి చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రియాంక వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రియాంక గాంధీకు ఆమె నాయనమ్మ ఇందిరతో చాలా సారూప్యతలు ఉన్నాయి. అంటే సోషల్‌మీడియాలో ఎక్కువగా వినిపించే, కనిపించే ముక్కు, ముఖం గురించి పోలికలు కాదండోయ్. పనితీరు, జీవనశైలిలోనూ ప్రియాంకకు ఇందిరాతో దగ్గర పోలికలున్నాయట!
ఇందిరా గాంధీని 1952 ఎన్నికలలో పోటి చేయాలని నాటి కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే తన బిడ్డలు రాజీవ్, సంజయ్ చాలా చిన్న వారు కావడంతో ఇందిరా ఆ పని చేయలేదు. ప్రియాంక కూడా తన పిల్లలు రైహాన్, మిరాయా కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే దశాబ్దాల తరువాత, నాన్నమ్మ అడుగుజాడలను ప్రియాంక అనుసరించారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకున్నా ఇందిరా లాగే కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. ప్రియాంక 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని UPA కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
1984 అక్టోబర్‌లో ఇందిరా మరణానికి కేవలం రెండు రోజుల ముందు సోనియా మాట్లాడిన మాటలను ‘ది చినార్ లీవ్స్’ పుస్తకంలో ML ఫోతేదార్ రాసుకొచ్చారు. భవిష్యత్‌లో ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనే కోరికను ఫోతేదార్తో ప్రస్తావించారు. ఇక 2004లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అమేథి నుంచి పోటి చేయాలని రాహుల్ గాంధీకి చెప్పింది. దీంతో ప్రియాంక వెనక్కి తగ్గారు. అయితే ప్రత్యక్షంగా ప్రియాంక రాజకీయాల్లో లేకున్నా కాంగ్రెస్‌కు మాత్రం ట్రబుల్ షూటర్‌గా పనిచేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో సంక్షోభాలను తొలగించడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు.
1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన ఇందిరా… ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దూసుకెళ్లారు. 1952లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన ఇందిరా 15ఏళ్ల తర్వాత నేరుగా బరిలోకి దిగారు. అదే విధంగా, 1998లో సోనియా గాంధీ రాజకీయ అరంగేట్రం అప్పుడే ప్రియాంక కూడా వస్తారని అంతా భావించారు. అయితే ఇందిరా లాగానే చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దూకారు. ఇలా చాలా విషయాల్లో నానమ్మ ప్రియాంకతో ఇందిరాకు పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు!
Also read: అధికారులపై పవన్ సీరియస్.. నిధుల మళ్లింపుపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం..!