Student commits suicide in IIT: ఎన్నో కలలతో పాటు ఎంతో కష్టడితే కాని ఐఐటీల్లో అడుగు పెట్టలేరు. అలాంటిది ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోతనే మిగుల్చుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీల్లో స్టూడెంట్స్ వరుస సూసైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఏడాది వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక తాజాగా సంగారెడ్డిలో హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఒడిశాకు చెందిన మమైతా నాయక్ ఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్యే తన ఇంటికి వెళ్ళి వచ్చిన ఆమె పదిరోజుల క్రితమే క్యాంపస్ కు తిరిగి వచ్చింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఆమె క్యాంపస్ లోని తన రూమ్ లో ఉరి వేసుకుంది.
ఐఐటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆమె బలవన్మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గత ఐదేళ్ల కాలంలో 33 మంది ఐఐటీ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఈ మధ్య కాలంలో ఐఐటీలు, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంకా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ 61 ఆత్మహత్య కేసులను నమోదు చేశాయి. ఈ ఆత్మహత్యల్లో సగానికి పైగా ఐఐటీలు, నెక్ట్స్ ప్లేస్ లో ఎన్ ఐటీలు, తరువాత ఐఐఎం లున్నారు.