Rampur Village: బీఆర్ఎస్ (BRS)కే ఓటేస్తామని రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా రాంపూర్ (Siddipeta – Rampur) గ్రామంలో పర్యటించిన మంత్రి.. అక్కడ నిర్వహించిన హరితహారం (Harithaharam) కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాంపూర్ గ్రామస్థుల తీర్మాన పత్రాలను ఆ గ్రామ సర్పంచ్ మంత్రికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రాంపూర్ గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారన్నారు. రైతులను ఆదుకుంటున్న కేసీఆర్.. రైతు బాగుంటేనే రాష్ట్రం భాగుంటుందని భావించారన్నారు. అందుకే కేసీఆర్ రైతుబంధు పథకం (RYTHU BANDHU Scheme) తీసుకువచ్చి ఈ పథకం ద్వారా రైతులకు సహాయం చేస్తున్నారన్నారు. రైతులు ప్రమాదంలో మరణిస్తే.. వారి కుటుంబానికి ప్రభుత్వం బీమాను అందిస్తుందని తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వం కోటి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక మొక్కలు నాటుతున్న జిల్లాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 279 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) వెల్లడించారు. హరితహారం కింద మొక్కలు నాటడం ద్వారా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 28 శాతానికి పెరిగాయన్నారు. ఈ సంఖ్యను ఇంకా 5 శాతం పెంచుకొని 33 శాతానికి తీసుకురావాలని, అదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతోండటాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాల గురించి విపక్ష నేతలు మాట్లాడుతున్నారన్న ఆయన.. ప్రజల కష్టాలు వారికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ప్రజల మధ్యకు వెళ్లి ఏం మాట్లాడాలో తెలియక పోవడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయలేని కేంద్ర ప్రభుత్వం.. రైతులను ఆదుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పారు.