Gudlavalleru Issue: రాష్ట్రవ్యాప్తంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ వాష్ రూమ్స్ లో రహస్యంగా కెమెరాలను ఉంచి వీడియోలు తీస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయమై కాలేజీ వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వీరి ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పోలీసులు అటువంటిది ఏదీ లేదని చెబుతూ వచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఈ అంశంపై విచారణను పోలీసులు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు విచారణ నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు జరుగుతున్న విచారణపై సమీక్షలు జరుపుతూ వస్తున్నారు.
Gudlavalleru Issue: ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో వికాహరణ వేగవంతంగా జరుగుతోంది. మరోవైపు కాలేజీ వద్ద బందోబస్తును కూడా పటిష్టం చేశారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని గుడ్లవల్లేరు రప్పించారు. కోడూరు నుంచి ఎస్ఐ శిరీషను కూడా ఇక్కడ బందోబస్తు విధుల్లో నియమించారు. అయితే, ఆమె ఒక సమయంలో విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. దీంతో ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సెటివ్ మేటర్ ఉన్న పరిస్థితిలో ఎస్ఐ శిరీష ప్రవర్తన సరికాదని చెబుతూ ఆమె వ్యహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే బాధలో ఉన్న విద్యార్థినులకు ఊరట కలిగించాల్సింది పోయి, వారిపై అధికారులు దురుసుగా ప్రవర్తించడం సరైన విధానం కాదని ఆయన చెప్పారు. అంతేకాకుండా, ఇలాంటి పోకడలు సహించేది లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Gudlavalleru Issue: దీంతో అధికారులు ఎస్ఐ శిరీష దర్యాప్తు బృందంలో లేరనీ.. ఆమెను అక్కడ బందోబస్తు కోసం పిలిపించామని సీఎంకు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, శిరీష దురుసు ప్రవర్తన వెలుగులోకి రాగానే, ఆమెను అక్కడ విధుల నుంచి వెంటనే తప్పించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ నుంచి వివరణ తీసుకున్న తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని…వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.