కాంగ్రెస్ పార్టీలో టికెట్ల చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా ఆ పార్టీలో టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సైతం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీకి సంచలన లేఖ రాశారు. ముఖ్యంగా ఇటీవల కేటాయించినటువంటి 54 టిక్కెట్లలో దాదాపు 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అంటూ ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఆయన ప్రధానంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని తన అనుచరులతో కలిసి ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: అన్నీ చేసినం.. మళ్లీ గెలుస్తాం: హరీష్ రావు
అంతేకాదు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని చేరుచుకోవడం ద్వారా పార్టీలో మొదటి నుంచి ఉంటున్న సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆయన లేఖలో సుదీర్ఘంగా పేర్కొన్నారు. 2014 సంవత్సరం నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందిస్తున్నారని.. వారందరినీ కాదని టిపిసిసి అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలను దూరం పెట్టి తన సన్నిహితులకు టికెట్లను కేటాయింపు చేసుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఇటీవలే దేశవ్యాప్తంగా కులజన గణనకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో బీసీలకు ఈ విధంగా అన్యాయం చేయడం తగదు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 1977 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధిక సీట్లు లభించాయన్న సంగతి గుర్తు చేశారు. అదేవిధంగా యూపీఏ- 1, యూపీఏ-2 ప్రభుత్వాల ఏర్పాటులో కూడా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాలు లభించినట్లు గుర్తు చేశారు.
ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలను ముఖ్యమంత్రులను చేసిందన్న సంగతి ఆయన లేఖలో గుర్తు చేశారు. అదేవిధంగా 1960లో దళిత వర్గానికి చెందినటువంటి దామోదరం సంజీవయ్యను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో కూడా బీసీలకు ఇతర వెనుకబడిన వర్గాలకు టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.