Gold Demand: గత కొన్ని వారాల్లో బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి.ఈ రెండు విలువైన లోహాలు గత అనేక ట్రేడింగ్ సెషన్లలో కొత్త రికార్డు గరిష్టాలను సాధించాయి. అయితే, ఒకపక్క ధరలు పెరుగుతున్నప్పటికీ, మరోపక్క బంగారం డిమాండ్ పెరుగుతూనే ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2024’ పేరుతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, మార్చి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్(Gold Demand) 8 శాతం పెరిగింది.
ధరలు పెరిగినా బంగారం డిమాండ్ పెరుగుతోంది
భారతదేశంలో, బంగారం – వెండిపై పెట్టుబడి ఎప్పుడూ సురక్షితమైన – ప్రసిద్ధ పెట్టుబడిగా పరిగణిస్తూ వస్తున్నారు. దేశంలో బంగారానికి డిమాండ్(Gold Demand) పెరగడానికి ఇదే కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం బంగారం ధర పెరుగుతున్నప్పటికీ, బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. మార్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 8 శాతం (136.6 టన్నులు) పెరిగిందని నివేదికలో పేర్కొంది. డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు కూడా పెరిగాయి. ఏప్రిల్ 30న బంగారం ధర రూ.74,080గా ఉంది.
బంగారం రూ.లక్ష దాటవచ్చు
బంగారం ధరల పెరుగుదలను పరిశీలిస్తే.. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర రూ.లక్షకు చేరుకోవచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. విలువ పరంగా జనవరి-మార్చి కాలంలో బంగారం డిమాండ్(Gold Demand)లో వార్షికంగా 20 శాతం పెరుగుదల నమోదై రూ.75,470 కోట్లకు చేరుకుంది. భారత్లో బంగారు ఆభరణాలు మరియు బంగారం పెట్టుబడులు రెండూ పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గ్లోబల్ రిపోర్ట్ ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2024‘లో పేర్కొంది.
ఆభరణాల కొనుగోలు-పెట్టుబడి రెండింటిలోనూ పెరుగుదల
ఆభరణాలుగా బంగారం కొనడం అలానే పెట్టుబడితో సహా భారతదేశంలో మొత్తం బంగారం డిమాండ్(Gold Demand) ఈ సంవత్సరం జనవరి-మార్చిలో 136.6 టన్నులకు పెరిగింది. ఇది క్రితం సంవత్సరం కాలంలో 126.3 టన్నులు. దీని కింద ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 91.9 టన్నుల నుంచి 95.5 టన్నులకు చేరుకోగా, మొత్తం పెట్టుబడి డిమాండ్ (నాణేలతో సహా) 19 శాతం పెరిగి 34.4 టన్నుల నుంచి 41.1 టన్నులకు చేరుకుంది.
Also Read: గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే..
నిపుణులు ఏమంటున్నారు?
పశ్చిమ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం వల్ల ప్రపంచంలోని తూర్పు మార్కెట్లో అంటే ఇండియా, చైనాలలో లోహాల ధరలు ప్రభావితం అవుతున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ అన్నారు. భారతదేశంలో, బంగారు ఆభరణాలు – పెట్టుబడి రెండూ శాశ్వతమైనవి. బంగారం, వెండి పెరుగుదలను పరిశీలిస్తే, ఈ ఏడాది చివరి నాటికి బంగారం డిమాండ్(Gold Demand) 747.5 టన్నులకు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు.