Cashless Everywhere: హెల్త్ ఇన్సూరెన్స్.. ఇప్పుడిప్పుడే అందరికీ చేరువ అవుతోంది. ప్రతి వ్యక్తి ఎదో ఒక సందర్భంలో అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆసుపత్రి ఖర్చులు చాలా భారంగా మారతాయి. ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే.. ఆ కుటుంబం మొత్తం పేదరికంలోకి వెళ్లిపోవడం తెలిసిందే. కోవిడ్ సమయంలో ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నవారు చాలామందే ఉన్నారు. అందుకే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఎక్కువమంది ముందుకు వస్తున్నారు. కానీ, ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలతో హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance)పాలసీ తీసుకున్నవారు చాలాసార్లు ఇబ్బందులు పడటం జరుగుతోంది. ఆ ఇబ్బందుల్లో ముఖ్యమైనది ఏమిటంటే.. అనుకోకుండా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే ఫీజులు చెల్లించడానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం.
ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో ముందుగా కచ్చితంగా డబ్బు ఖర్చు చేసి తరువాత ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది ఆసుపత్రిలో బిల్లులు కట్టలేక.. అప్పులు చేయాల్సిన బాధ వస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల నెట్వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్ లెస్ ఫెసిలిటీ (Cashless Treatment) ఉంటుంది. అయితే, అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య అంటే గుండెనొప్పి.. ఏదైనా స్ట్రోక్.. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఇన్సూరెన్స్ కంపెనీల నెట్వర్క్ ఆసుపత్రికి చేరుకోవడం కష్టం. అటువంటప్పుడు చేతిలో డబ్బు లేకపోతె వైద్యం అందని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది.
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (General Insurance Council) హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి “క్యాష్‌లెస్ ఎవ్రీవేర్” (Cashless Everywhere)విధానాన్ని తీసుకువచ్చింది. అంటే ఇప్పుడు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా సరే.. డబ్బు చేతిలో ఉండాల్సిన పనిలేదు. ఆసుపత్రిలో వెంటనే వైద్య సహాయం లభిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీల నెట్వర్క్ లో ఆ ఆసుపత్రి ఉండాల్సిన పనిలేదు. అంటే, ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా జబ్బు చేస్తే వారింటికి దగ్గరలోని ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ వైద్యం చేయించుకోవచ్చు. అది ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆసుపత్రి కానవసరం లేదు. ఆసుపత్రిలో చేరినపుడు క్లెయిమ్ ఇన్సూరెన్స్ పరిధిలో.. ఇన్సూరెన్స్ నియమాలకు లోబడి ఉంటే ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది.
Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు
ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్‌లో లేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలసీదారుల భారాన్ని తగ్గించడానికి, GIC, అన్ని జనరల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదించి, “క్యాష్‌లెస్ ఎవ్రీవేర్” (Cashless Everywhere) కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రతిచోటా నగదు రహితం కింద, పాలసీదారు వారు ఎంచుకున్న ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో అటువంటి ఆసుపత్రి లేకపోయినా నగదు రహిత సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
అయితే, ఇలా క్యాష్‌లెస్ వైద్యం చేయించుకోవాలంటే.. ఈ షరతులు గమనించాలి.
- ఏదైనా ఆసుపత్రిలో చేరడానికి కనీసం 48 గంటల ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియచేయాలి. అంటే, ముందుగా నిర్ణయించుకున్న ఆపరేషన్స్ లేదా ఇతర వైద్య సహాయం కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి వివరాలు ముందుగా చెప్పాల్సి ఉంటుంది.
- అయితే, అత్యవసర చికిత్సలు అంటే, ఏదైనా ఏక్సిడెంట్.. అకస్మాత్తుగా వచ్చిన అనారోగ్యం విషయంలో పాలసీ హోల్డర్ ఆసుపత్రిలో చేరిన 48 గంటలలోపు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి.
- పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ ను ఇన్సూరెన్స్ కంపెనీలు ఆమోదించాలి. బీమా కంపెనీ నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం నగదు రహిత సదుపాయం అనుమతించాలి
దీర్ఘకాలంలో Cashless Everywhere ఆరోగ్య బీమా రంగంలో మోసపూరిత క్లెయిమ్‌ల సమస్యను నియంత్రిస్తుందని బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ MD-CEO అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ (Tapan Singhel) చెప్పారు. ఇప్ప్పుడు మన దేశంలో ఆరోగ్య బీమా పొందడానికి మరింత మంది ముందుకు వస్తారని అయన అంటున్నారు. దీంతో ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
Watch this interesting Video: