Folk Singer Gaddar : ‘రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా.. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా..’ అంటూ తన పాటలతో పోరు బాటలు వేసిన నిఖార్సైన తెలంగాణ (Telangana) వాది గద్దరన్న. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొల్పారు. ఆయన మాటలు ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిల్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘పొడుస్తున్న పొద్దు మీద…’ అమ్మా తెలంగాణమ్మా’ వంటి విప్లవాత్మక పాటలు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. భద్రం కొడుకో.. పొట్టకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు.. సిరిమల్లె చెట్టుకింద లచ్చువమ్మో.. నిండూ అమాసనాడు ఓలచ్చ గుమ్మడి.. లాంటి ప్రజల కష్టాలకు కన్నీటితో పాట రూపం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంపై తొలి పాట గద్దరన్నదే. ఆటపాటల కలగలిపిన ధూమ్ ధామ్ ను రూపొందించి.. పల్లెపల్లకు తెలంగాణ ఉద్యమ పాటను తీసుకెళ్లిన వారిలో గద్దర్ (Gaddar) ముందువరుసలో ఉంటారు.
గద్దర్ యాదిలో పాటలు
పీడిత ప్రజల గొంతును ఆయన పాటలతో సమాజానికి వినిపించిన విప్లవకవి గద్దర్. సామజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. ఆయన ఉద్వేగభరితమైన పాటలు, సామజిక న్యాయం కోసం చేసిన పోరాటం, తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. పేదల రాజ్యమే అంతిమ లక్ష్యంగా తన పాటలతో పోరాడిన ఈ విప్లవగీతం 2023, ఆగస్టు 6న మూగబోయింది. నేడు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దర్ యాదిలో కొన్ని పాటలను విడుదల చేస్తూ ఆయన పై అభిమానం చాటుకుంటున్నారు గద్దర్ శిష్యులు, అభిమానులు.
Also Read: Devara: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ‘చుట్టమల్లె’ సాంగ్ – Rtvlive.com