Firing in Miyapur: నగర శివారులో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. మియాపూర్ పీఎస్ పరిధిలోని మదీనాగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ (Sandarshini Elite Restaurant) లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్ అనే వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తి కంట్రీ మేడ్ గన్ తో 5 రౌండ్లు కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో కాల్పుల మోతతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. 35 ఏళ్ల దేవేందర్ గాయన్ కోల్ కత్తాకు చెందినవాడు. ఆరు నెలల క్రితమే సందర్శిని హోటల్ లో మేనేజర్ గా చేరాడు.
అయితే నిన్న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో అతని పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అతను తీవ్రగాయాల పాలు కావడంతో హోటల్ సిబ్బంది అతడ్ని హుటాహుటిన దగ్గరలోని అర్చన ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
కాగా, వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సాధ్యమైనంత త్వరలోనే నిందితుడి పట్టుకుంటామని మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ అన్నారు.
ప్రేమ వ్యవహారమే కారణమా..!
ఇక ఈ కాల్పుల వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. అదే సందర్శిని హోటల్ లో పని చేస్తున్న ఓ అమ్మాయి విషయంలోనే మేనేజన్ దేవేందర్ గాయన్ ఇంకా నిందితుడి మధ్య గొడవలున్నాయని తెలిసింది. దీంతోనే నిందితుడు దేవేందర్ పై కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.