మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఆధ్మాత్మిక చింతన పెరిగేందుకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నో దశాబ్దాల పోరాటం తరువాత రూపు దిద్దుకుంటున్న అయోధ్య రామ మందిరం జనవరి 22 న అంగరంగ వైభవంగా పునః ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే కాకుండా వచ్చే ఏడాది మరి కొన్ని ఆలయాలు కూడా ప్రారంభమై భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఇప్పుడు ఆ ఆలయాలు ఏంటో, వాటి విశిష్టతలు ఏంటో..అవి ఎక్కడ ప్రారంభం కాబోతున్నాయో తెలుసుకుందాం…
అయోధ్య రామ మందిరం…
ఎందరో మహానుభావుల కల..ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం నిర్మాణం. ఎన్నో దశాబ్దాల తరువాత ఈ మందిరం రూపుదిద్దుకుని జనవరి 22న ఎంతో వైభవంగా ఎందరో అతిరథ మహారథుల మధ్య ప్రారంభం కానుంది. ఈ మందిరాన్ని 2500 సంవత్సరాల పాటు ఎన్ని విపత్తులు వచ్చిన తట్టుకునేలా రూపొందించారు.
ఈ మందిరంలోని గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవానికి దేశ విదేశాల్లోని ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలు వెళ్లాయి.
బీహార్- విరాట్ రామాయణ ఆలయం:
బీహార్ లోని తూర్పు చంపారన్ ఆలయంలో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన మరో మహోన్నతమైన ఆలయం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద రామాయణ ఆలయ నిర్మాణం ఇది అని చెప్పుకోవచ్చు. 2024 చివరకు పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు. 270 అడుగుల డోమ్ ఎత్తుతో ఈ ఆలయం అంగ్కోర్ వాట్ గుడిని దాటిపోనున్నది.
ఆలయంలో 33 అడుగుల నల్ల గ్రానైట్ శివలింగం ఉంటుంది.12 డోములతో కూడిన ఈ ఆలయాన్ని 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
ఒడిశా: శ్రీ జగన్నాథ్ పూరీ హెరిటేజ్ కారిడార్:
ఈ ఆలయాన్ని జనవరి 17న భక్తులకు అంకితం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఒడిశాలోని జగన్నాథుడి ఆలయం చుట్టూ 1.5 కిలో మీటర్ల మేర పరిసరాలను సుందరీకరణ చేయడానికి చేపట్టిన ప్రాజెక్టు ఇది. దీనికి సుమారు రూ. 943 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్:
శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్ లేక టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానేటేరియం పశ్చిమబెంగాల్ లోని మాయాపూర్ లో నిర్మిస్తున్నారు. 113 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది ప్రసిద్దికెక్కన్నుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్‌లు ఈ ఆలయానికి ఉన్నాయి.
ఈ ఆలయ ప్రధాన మందిరంలో ఒకేసారి 10 వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 2010లో ప్రారంభమైన దీని నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. 2024 ఆఖరులో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉన్నది.
Also read: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..ఎందుకంటే!