Government Job Exams in 15 Indian languages: ప్రభుత్వం చేపట్టే ఏ పరీక్షను అయినా సరే 15 భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం ఇటీవల నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) బుధవారం మీడియాతో తెలిపారు. ఈ నిర్ణయం దేశంలో పోటీ పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువత పోటీపరీక్షల్లో ఏ అవకాశాన్ని కోల్పోకుండా ఉండే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇలా 15 భాషల్లో పరీక్షలను నిర్వహించడం వల్ల ప్రాంతీయ భాషలను కూడా ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయన అన్నారు. దీని గురించి 14 వ హిందీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో (14th Hindi Consultative Committee meeting) ప్రసంగించారు. ” కేవలం భాష అనేది ఏ యువకునికి కూడా అడ్డు కాకుడదనేది కేంద్రం నిర్ణయమని” ఆయన పేర్కొన్నారు.
హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి వంటి 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రం రూపొందిస్తామని ఆయన చెప్పారు.
అధికార భాష హిందీతో పాటు భారతీయ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంలో గత తొమ్మిదేళ్లకు పైగా మంచి పురోగతిని సాధించామని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువత పోటీ పరీక్షల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపిక అవకాశాలు కూడా మెరుగవుతాయని తెలిపారు.
ఇంగ్లీష్ మరియు హిందీ కాకుండా ఇతర భాషలలో SSC పరీక్షలను నిర్వహించాలని వివిధ రాష్ట్రాల నుండి నిరంతర డిమాండ్లు ఉన్నాయని సింగ్ చెప్పారు.
“ప్రభుత్వం ఇతర విషయాలతోపాటు భాష అంశాన్ని కూడా పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ విధానం అధికార భాషా నియమాలు, 1976తో ప్రారంభించబడినప్పటికీ, గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అభ్యర్థులు తమ పరీక్షలను 15 భాషల్లో రాయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే ఫార్మాట్‌ను విడుదల చేసిందని, మొత్తం 22 షెడ్యూల్డ్ భాషల్లో రాత పరీక్షలను అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సింగ్ చెప్పారు.
జేఈఈ (JEE), నీట్(NEET), యూజీసీ (UGC)పరీక్షలు కూడా మన 12 భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీలో (UPSC)ఇప్పటికీ ఉన్నత చదువులకు సంబంధించిన పుస్తకాల కొరత ఉందని, అయితే భారతీయ భాషల్లో ప్రత్యేక పుస్తకాలను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.
దేశంలోనే తొలిసారిగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సును గతేడాది అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రారంభించారు. ఇప్పుడు హిందీలో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ప్రారంభించిన రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించిందన్నారు.
Also Read: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే…జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్…!!