CM KCR Flag Hoist at Golconda Kota: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలోని రాణిమహల్ లాన్స్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ (ఆగస్టు 15) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో పని చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లపై ఆమె కూలంకషంగా చర్చించారు.
పోలీసు శాఖ బ్లూ బుక్ ప్రకారం అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులకు కూడా ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ నిర్వహణ, సీటింగ్ ఏర్పాట్లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలతో పాటు ఆహ్వాన పత్రాల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ముఖ్య కార్యదర్శి పరిశీలించారు. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి సుధీర్ బాబు, రోడ్లు అండ్ భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, HMWSSB మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, I&PR కమిషనర్ అశోక్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోలీసు అధికారులకు అవార్డులు:
గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు ఇందులో ఉన్నారు. భూపాలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) రామ్ నరసింహారెడ్డి, కొయ్యూరు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) వీ నరేష్‌లు సీఎం చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందుకోనున్నారు . ఇటీవలి వరదల సమయంలో చూపిన ధైర్యసాహసాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఎస్ఐ నరేష్ తన ప్రత్యేక బృందంతో కలిసి పివి నగర్ వద్ద మానేరు నదిలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఇక భారీ వరదలకు మృతి చెందిన గొర్రె ఒడిరెడ్డి మృతదేహాన్ని మోరంచలపల్లి నుంచి మోసుకెళ్లారు సిఐ రెడ్డి. కుళ్లిపోయిన మృతదేహం కావడంతో ఎవరూ ముందుకు రాని సమయంలో రెడ్డి ఈ పని చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎస్పీ పుల్లా కరుణాకర్ అధికారుల అంకితభావాన్ని కొనియాడారు, విధి నిర్వహణలో నిబద్ధతను కొనియాడారు. “మన జిల్లా పోలీసు దళం ప్రదర్శించిన అంకితభావాన్ని ప్రభుత్వం గుర్తించడం, ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. సాహసోపేతమైన హోంగార్డుల నుంచి అనుభవజ్ఞులైన సీనియర్ అధికారుల వరకు, ప్రతి వ్యక్తి వరదల సమయంలో సందర్భోచితంగా పని చేశారు. ప్రజా సేవ నిజమైన సారాంశాన్ని ఉదహరించారు” అని ఎస్పీ వరదల సమయంలో పోలీసు సిబ్బంది సేవలను గుర్తు చేసుకున్నారు.
Also Read: ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే?