Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని కొనియాడారు. ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయన వివరణ ఇస్తారని తెలిపారు. ఎవరో ఏదో డైరీలో రాసుకుంటే.. దానికి చంద్రబాబుకు ఏం సంబంధమన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేసి మూడో సారి కూడా పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని స్పష్టంచేశారు.
కేశినేని లాంటి ఎంపీని చూడలేదు..
మరోవైపు మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరావు కేశినేని నానిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ఎంపీగా కేశినేని నానిని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ నాని పనితీరు చూశారన్నారు. విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడాదరు. తన 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఎంపీని చూడలేదని వసంత కామెంట్స్ చేశారు. ఆయన తనయుడు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా వసంత నాగేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
టీడీపీలో సైలెంట్ అయిన కేశినేని..
కొంతకాలంగా టీడీపీలో సైలెంట్‌గా ఉంటున్నారు కేశినేని నాని. విజయవాడలో జరిగిన లోకేష్ పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. పాదయాత్ర బాధ్యతలను ఆయన సోదరుడు కేశినేని చిన్నికి పార్టీ అప్పగించింది. దీంతో నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలను కేశినేని నాని పొగడటం.. వారు నానిని పొగడటం చేయడంతో ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆయన పక్కనే కేశినేని ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు మద్దతుగా కేశినేని మాట్లాడటం రాష్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.