Corona Deaths: కరోనాకు చిన్నా పెద్ద తేడా తెలియదు.. డబ్బులున్నోడు లేనోడన్న భేదం ఎరుగదని వైరస్ అది.. సామాన్యులు నుంచి సెలబ్రెటీల వరకు ఎంతోమందిని బలితీసుకున్న ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ మరో దిగ్గజ నటుడుని కోల్పోయింది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తమిళస్టార్ హీరో విజయ్‌కాంత్‌కు కరోనా కూడా సోకడంతో ఆయన తుది శ్వాస విచిచారు. ఇక గతంలో లెజండరీ సింగర్ ఎస్పీ బాలు సైతం కరోనాతో కన్నుమూశారు. ఆయన గానం ముగబోవడంతో నాడు యావత్ తెలుగు ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. మధురమైన గానాలతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. సినీ చిత్ర పరిశ్రమలో గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, తనదైన ముద్ర వేసుకున్న S.P.B 2020 లో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆగస్టు 5 కరోనతో MGM ఆసుపత్రిలో చేరిన ఆయన నెల రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 25 న కన్నుమూశారు. 2020 లో దిగ్గజ గాయకుడు S.P.B మరణం సినీ పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
బాలసుబ్రహ్మణ్యం తన 50 ఏళ్ల సినీ జీవితంలో 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు 16 భాషల్లో ఆయన గాత్రం వినిపించారు. 1966 లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడుగా ఆయన ప్రస్థానం ప్రారంభించారు. నటీ, నటుల హావ భావాలు, నటన శైలికి అనుగుణంగా పాటలు పాడడంలో ప్రసిద్ధి చెందారు. S.P.B 1981, 8 వ తేదీన ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 27 పాటలను రికార్డ్ చేసి గాయకుడిగా రికార్డు సృష్టించారు. అంతే కాదు హిందీలో 16, తమిళ్లో 19 పాటలను ఒకే రోజు రికార్డింగ్ పూర్తి చేసిన ఘనత ఆయనదే. S.P.B 2001 లో పద్మ శ్రీ, 2011 లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ భాగాల్లో నంది అవార్డును అందుకున్నారు . గాయకుడుగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రజినీకాంత్, కమల్ హాసన్, రఘువరన్, జెమిని గణేశన్, సల్మాన్ ఖాన్ ఎంతో మంది నటులకు డబ్బింగ్ చెప్పారు.
తమిళ నటుడు విజయ్ కాంత్
నటుడు విజయ్ కాంత్ తమిళ సినిమా రంగంలో గొప్ప నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నిర్మాత, దర్శకుడుగా కూడా మంచి గుర్తింపు పొందారు. విజయకాంత్ నటించిన 100 వ చిత్రంగా ‘కెప్టెన్ ప్రభాకరన్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత అందరు ఆయనను కెప్టెన్ అని పిలవడం మొదలు పెట్టారు. విజయ్ కాంత్ 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందారు. సినిమాల తర్వాత 2005 లో విజయకాంత్ DMDK పార్టీనీ స్థాపించారు. నటుడిగా రాజకీయ వేత్తగా రాణించిన విజయ్ కాంత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం నిమోనియా సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 28 న తుది శ్వాశ విడిచారు. కరోనా సమస్యతో 2020 లో బాల సుబ్రహ్మణ్యం, 2023 లో విజయ్ కాంత్ వంటి దిగ్గజ కళాకారులను కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదం.