Road Accident : అనంతపురం(Anantapur) జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి(Car And Lorry Collided). ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.ప్రమాద ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, గుత్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. మృతులంతా అనంతపురంలోని రాణినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… అనంతపురంలోని రాణినగర్ కు చెందిన షేక్ సురోజ్ బాషా వివాహం ఈనెల 27న జరగనుంది. అయితే, కుటుంబ సభ్యులు ఏడుగురు వాహనంలో పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. వస్త్రాల కొనుగోలు అనంతరం హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. బాచుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు లారీ వెళ్తుంది. ఆ లారీ కారును ఢీకొట్టింది.
దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని గుత్తి ఆస్పత్రికి తరలించారు.తీవ్రగాయాలైన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులను అనంతపురంలోని రాణినగర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అల్లీ సాహెబ్ (58), షేక్. సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40) ప్రమాదంలో మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Also read: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి