ఈ నెల 10న హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఒకె రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం అదిలాబాద్ జిల్లాలో అమిత్ షా సభ ఉండగా.. సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. బండ్లగుడా జాగీర్ మున్సిపల్ పరిధిలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సభలతో జోష్ లో ఉన్న కాషాయ పార్టీ నేతలు… భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఏడు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అధికారమే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు.
పెరుగుతున్న జోష్:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీజేపీ(BJP) రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో నిర్వహించారు. అసెంబ్లీ ఇంచార్జీ లు, కన్వీనర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాదికారులు, సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా హాజరయ్యారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు.
ఏడు తీర్మానాలు:
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో ఏడు తీర్మానాలు ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ పై ధన్యవాద తీర్మానాన్ని డికె అరుణ సమావేశంలో ప్రవేశపెట్టారు. జీ20 సమావేశాలు విజయవంతం పై ఎమ్మెల్సీ AVN రెడ్డి తీర్మానం పెట్టారు. జాతీయ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుకు ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు ఎంపీ అరవింద్. కీలకమైన రాజకీయ తీర్మానాన్ని బండి సంజయ్ సమావేశంలో ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎండ గట్టారు. ట్రైబల్ యూనివర్శిటీ మంజూరు పై ధన్యవాద తీర్మానాన్ని సొయం బాపూరావు ప్రవేశ పెట్టారు. చంద్రయాన్ 3 విజయం పై మురళీధర్ రావు, కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు పై జితేందర్ రెడ్డి ధన్యవాద తీర్మానం పెట్టారు.
డిసెంబర్ రెండో వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని హైదరాబాద్ రావాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతలు సమావేశంలో జాతీయ నేతల చెవిలో మనసులో మాటలను చెప్పేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి జాతీయ నేతల సమక్షంలో రాష్ట్ర బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ఎన్నికల క్షేత్రంలో ఎలా అమలు చేస్తారనేది చూడాలి.
ALSO READ: జగన్పై ఉన్న కేసులు ఎత్తివేస్తారా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!