Adulterated Chocolates in Rajendranagar: చాక్లెట్స్..అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరూ. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సందర్భాలలో పిల్లల మారం తగ్గించడానికి తల్లిదండ్రులు వారికి ఇష్టమైన చాక్లెట్లను అందిస్తారు. అయితే, పిల్లలకు కొని తెచ్చే చాక్లెట్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో కల్తీ చాక్లెట్ల తయారీ ఎక్కువుగా కనిపిస్తోంది. తాజాగా, హైదరాబాద్ లో కల్తీ చాక్లెట్ల దందా ఒకటి వెలుగులోకి వచ్చింది.
Also Read: ట్యాంక్ బండ్పై కేక్ కట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
రాజేంద్రనగర్లో కొందరు కేటుగాళ్లు.. కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు. హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ చాక్లెట్ల దందా నడుస్తోంది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్లను తయారు చేస్తున్నారు. వీటి తయారీలో ప్రమాదకర రసాయనాలు నిర్వాహకులు వాడుతున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా కనిపించడం లేదు.
దుర్గంధంలోనే చాక్లెట్లను తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల ప్రాణాలతో కంత్రీగాళ్లు చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. కుళ్లిపోయిన చింతపండును మరిగించగా వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కానీ స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కానీ చాక్లెట్ల తయారీ విషయంలో ఎలాంటి అనుమతి పొందింది కూడా లేదని తెలుస్తోంది. కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.