జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహంపై సొంత పార్టీ నేతలే తిరుగబడ్డారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎర్రవల్లి చౌరస్తాలో ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన బీఆర్ఎస్ నాయకులు.. సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అబ్రహంకు మళ్లీ టికెట్ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అతనికి బీ ఫామ్ ఇవ్వద్దంటూ ప్లకార్డులు చేతపట్టి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అబ్రహంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి సీఎం కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని కోరారు. నియోజకవర్గంలో అబ్రహం ఆగడాలు సృతి మించిపోయాయని, గత 5 ఏళ్లలో అబ్రహం అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అబ్రహం అవినీతి, అక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్న ఎంపీపీ.. రానున్న ఎన్నికల్లో అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము ఆయనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అబ్రహంకు తాను సహకరిస్తే అవినీతి పరులకు మీరు మద్దతు ఇస్తున్నారా ? అని ప్రజలు తమను ప్రశ్నిస్తారని వారు తెలిపారు.
మరోవైపు అలంపూర్ నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయి. సీటు తమకే వస్తుందని ఆశపడ్డ బీఆర్ఎస్ నేతలు.. టికెట్ దక్కకపోవడంతో ఇరువర్గాలుగా విడిపోయి ధర్నాలకు దిగుతున్నారు. దీంతో సొంత పార్టీలోనే వర్గ విభేదాలు ఏర్పడుతున్నాయి. వర్గ విభేదాల వల్ల రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, సీఎం కేసీఆర్ దీని గురించి చర్చించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.