తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంత నిర్లక్ష్యం వహించారో తెలుస్తే మీరు షాక్ అవుతారు. సర్కార్ తో కొట్లాడి అదనపు నిధులు తీసుకురావడం దేవుడెరుగు. ఉన్న నిధులనే ఖర్చు చేయలని తెలంగాణ ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కొలువు దీరిన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మొదటి రెండేళ్లు ఒక్కో నియోజవర్గానికి ఏడాదికి రూ. 1.50కోట్లు కేటాయించింది.
తర్వాత మూడేళ్లు రూ. 3 కోట్లు కేటాయించింది. స్కూల్స్ బిల్డింగ్స్, నాలాలు, బోరుబావులు, సీసీరోడ్లు, వీధి లైట్ల నుంచి మొదలు పెడితే నియోజకవర్గంలో ఎన్నో పనులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. గవర్నర్ కోటా, అసెంబ్లీ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు అయితే తమకు విడుదలైన నిధులను రాష్ట్రంలో ఎక్కడైనా ఖర్చు చేసుకోవచ్చు. మిగతా ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలి. కానీ ఇఫ్పటివరకు నిధులు పూర్తిగా సద్వినియోగం కాలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవీకాలంలో రిలీజైన సీడీఎఫ్ నిధులను కేవలం 40శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇది వారి పనితీరుకు అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి: పిల్లలలో కడుపు నొప్పిని తగ్గించే బెస్ట్ హోం రెమెడీస్ ఇవే..!!
4,150కోట్లు నిధులు మంజూరు:
రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు 4,150కోట్లు. కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది కేవలం 1,614కోట్లు మాత్రమే. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీడీఎఫ్ నిధుల దుర్వినియోగానికి ఇది నిదర్శనం. రూ.611 కోట్లతో చేపట్టిన 17,683ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. సీడీఎఫ్ కింద ఒక్కో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి ప్రభుత్వం రూ. 5కోట్ల చొప్పున మంజూరు చేయగా…వాటిని కొన్నిరకాల పనులకు మాత్రమే కేటాయించడం చూస్తేంటే వారి పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 2018-19లో రూ. 105కోట్లు, 2021-22లో రూ. 195కోట్లు 2022-23లో రూ. 161కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ఇంకా టేకాఫ్ కాలేదంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ. 11కోట్లు ప్రభుత్వం కేటాయించినా వాటిలో నుంచి చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదు.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న సీడీఎఫ్ పనులు:
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే సీడీఎఫ్ పనులు దెబ్బతిన్నాయి. సంబంధిత జిల్లా ఇంఛార్జీ మంత్రి ఆమోదం పొందాల్సి ఉన్నా…మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలను సమర్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అధికారులు అంటున్నారు. సకాలంలో ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమవుతున్నారని..కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసేలా చూడటంలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తాగునీరు, డ్రైనేజీ, పైపులైన్లు, పబ్లిక్ హెల్త్ కేర్ భవనాలు, పాఠశాల భవనాలు, ట్యాంకులు, సీసీ రోడ్లు, హరితహారం, వీధిలైట్లు పనులకు ఈ నిధులను కేటాయించాలి. కానీ మంజూరైన నిధుల్లో 40శాతం కూడా అభివృద్ధికి వెచ్చించలేదని ఓ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!
ఎన్నికలకు ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం:
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డెవలప్ మెంట్ పనులు కోసం ప్రభుత్వం రెండు వారాల్లోగా సీఎం స్పెషల్ ఫండ్ నుంచి రూ. 5వేల కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎస్డీఎఫ్ నిధులనే ఖర్చుచేయని ప్రజాప్రతినిధులు ఇప్పుడు సీఎం స్పెషల్ ఫండ్స్ నుంచి ఎలాంటి డెవలప్ మెంట్ పనులకు ఖర్చు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల డెవలప్ మెంట్ పనుల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు…ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లు ఆకర్షించేందుకు ఇప్పుడు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామంటూ ఊదరగొడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.