Super Star Krishna Birth Anniversary: నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. గబ్బర్ సింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేల్చిన డైలాగ్ ఇది.. ఈ డైలాగ్‌కు అక్షరాల నిజస్వరూపం ఇచ్చే తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. టాలీవుడ్‌లో ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్‌లు అన్నీఇన్నీ కావు.. తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దడంలో ఆయన చేసిన ప్రయోగాలు మరో టాలీవుడ్ హీరో ఎవరు చేయలదంటారు సినీ ఎక్స్‌పర్ట్స్. మే 31న కృష్ణ జయంతి..ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌కు ఎలా ట్రెండ్ సెట్టర్‌గా మారారో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రయోగాల నటుడు..
Super Star Krishna Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. అంతేకాదు తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ORW రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి' లాంటి వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ సూపర్ స్టార్!
పాన్ వరల్డ్ స్టార్..
మొదటిసారిగా గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కృష్ణ. తెలుగులో తెరకెక్కిన తొలి జేమ్స్ బాండ్ తరహా మూవీ ఇదే. మొట్ట మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు 1970లో విడుదలైంది. మోసగాళ్ళకు మోసగాడు సినిమాను ఇంగ్లీష్ లోకి డబ్ చేసి 50దేశాల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన తొలితెలుగు సినిమా కూడా ఇదే. అంటే, ఇప్పుడు మనం పాన్ వరల్డ్ గా చెప్పుకుంటున్న సినిమాని ఐదు దశాబ్దాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ చేశారు.
బిజీ బిజీ హీరో..
Super Star Krishna Birth Anniversary: తెలుగు సినిమా ఎదగడానికి తన వంతుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు కృష్ణ. ఇతర హీరోలతో పోలిస్తే సాంకేతికంగా చాలా అడ్వాన్స్ సినిమాల్లో నటించారు. ఇక ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్‌దే. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో నటించారు. అంతకమందు 1971లో 11, 1970లో కృష్ణ హీరోగా నటించిన 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కృష్ణ ఎంత బిజీగా సినిమాల్లో నటించేవారో చెప్పేందుకు ఈ లెక్కలు.. రోజుకు నాలుగు షిఫ్టులు లెక్కన కృష్ణ పని చేసిన రోజులకు లెక్కలేదంటారు సినీ విశ్లేషకులు!
బుర్రిపాలెం బుల్లోడు to చెన్నపట్నం చిన్నోడు..
గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే 31 1943లో ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. వీరిది వ్యవసాయ కుటుంబం. సినిమాపై ఇష్టంతో చదువు పూర్తయ్యాక కృష్ణ చెన్నై వెళ్లారు. దర్శకుడు మధుసూదన రావు తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ పదండి ముందుకు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 1962లో రిలీజై ఈ మూవీలో ఆయన చిన్నపాత్రే చేశారు. ఆ తర్వాత హీరోగా కృష్ణ చేసిన మొదటి చిత్రం తేనెమనసులు 1965లో రిలీజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత కృష్ణ కెరీర్ పెద్ద టర్న్ తీసుకుంది. తక్కువ సమయంలో నాడు అగ్రహీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ANR సరసన చేరారు కృష్ణ!
Also Read: మహేష్ – రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప!
ఐదు దాశాబ్దాల కెరీర్..
Super Star Krishna Birth Anniversary: ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ లో కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించారు. నాలుగు తరాల హీరోయిన్స్‌తో కృష్ణ జతకట్టారు. విజయ నిర్మల, జయసుధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధ లాంటి స్టార్ హీరోయిన్స్‌తో కృష్ణ కెమిస్ట్రీ అద్భుతం. వీరితో పదుల సంఖ్యలో కృష్ణ చిత్రాలు చేశారు. అటు కొత్త తరం హీరోలు సత్తా చాటుతున్నా కృష్ణ మేనియా కొనసాగింది. 60లలో మొదలైన ఆయన విజయ యాత్ర 90ల వరకు కూడా సక్సెస్ ఫుల్‌గా కొనసాగింది.
రాజకీయాల్లోనూ..
హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కృష్ణ, 2017లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు కృష్ణ. 1989లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1991లో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కృష్ణ. ఇక తెలుగు సినిమాకు విశేష సేవలందించిన కృష్ణ, 2022 నవంబర్ 15న స్వర్గస్తులయ్యారు.