Ramoji Rao: పచ్చళ్ల నుంచి మీడియా దాకా..రామోజీ విజయ ప్రస్థానం ఇదే.. 

తెలుగు మీడియా మొఘల్ గా చెప్పుకునే రామోజీరావు జీవితంలో ఏ వ్యాపారం చేసినా సక్సెస్ గానే నిలిచింది.  మార్గదర్శి, ఈనాడు, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి , డాల్ఫిన్ హోటల్స్, ఎడ్వర్టైజ్మెంట్ ఇలా అన్నిరంగాల్లోనూ రామోజీ ముద్ర చెరిపి వేయలేనిది. 

Ramoji Rao: పచ్చళ్ల నుంచి మీడియా దాకా..రామోజీ విజయ ప్రస్థానం ఇదే.. 
New Update

Ramoji Rao: వ్యాపారం చేయాలంటే ఆసక్తి.. డబ్బు ఉంటే సరిపోదు. కష్టపడే తత్త్వం.. ఆకట్టుకునే నేర్పు.. కొత్తదనాన్ని ఒడిసిపట్టుకునే చొరవ.. ఇవన్నీ ఉండాలి. ఎప్పుడూ అందరూ వెళ్లే దారిలో వెళితే తినడానికి సరిపడా సంపాదన దొరుకుతుందేమో.. కానీ, కొత్తదారిని వెతికి.. అందులో నిత్యం కొత్తదనాన్ని చేర్చుతూ నిబద్ధతతో నడిస్తే ఒక్కడిగా మొదలు పెట్టిన వ్యాపారం.. వేలాదిమందికి ఉపాధి చూపించే నీడగా మారుతుంది. సరిగ్గా ఈ లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి రామోజీరావు. అడ్వర్టైజింగ్ రంగంలో చిన్న ఉద్యోగంతో జీవితాన్ని మొదలు పెట్టిన ఒక పల్లెటూరి నుంచి వచ్చిన వ్యక్తి.. పచ్చళ్ళు.. ఫైనాన్స్.. హోటల్స్.. పత్రిక.. టీవీ.. సినిమా.. ప్రపంచ స్థాయి స్థూడియోతో తిరుగులేని స్థాయికి చేరుకున్న దార్శనికుడు రామోజీ రావు. 

పేరు నచ్చక..

రామోజీరావు(Ramoji Rao)అసలు పేరు రామయ్య. ఆ పేరు నచ్చక స్కూలులో చేరినప్పుడే రామోజీరావుగా మార్చుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీ తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సబ్బారావు. ఆయన తాతయ్య పేరు రామయ్య. ఆయన మరణించిన 13 రోజులకు రామోజీ పుట్టారు. అందుకే ఈయనకు కూడా రామయ్య అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఈయనకు ఇద్దరు అక్కలు ఉన్నారు. 

అమ్మ కూచిగా..

ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన మగబిడ్డ కావడంతో రామోజీ అంటే విపరీతమైన ప్రేమ చూపించేవారు అందరూ. తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ.. తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు రామోజీరావు. తల్లి పరమ భక్తురాలు. ఆమె నుంచి శుచి, శుభ్రత, భక్తి అలవడ్డాయి రామోజీరావుకు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసం అంతా ఊరిలోనే గడిచింది. తరువాత 1947లో గుడివాడలో ఎనిమిదో తరగతి చదువు మొదలెట్టిన  ఆయన బీఎస్సీ వరకూ గుడివాడలోనే చదువుకున్నారు. రామోజీరావుకు 1961లో పెనమలూరుకు చెందిన రమాదేవి అనే ఆమెతో వివాహం చేశారు పెద్దలు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఆమె అసలు పేరు రమణమ్మ. ఆమె కూడా రామోజీ లానే తన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకున్నారు. 

అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం..

అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న స్నేహితుడు తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని రామోజీరావు ఆసక్తి చూపించారు. దీనికోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు.  మూడు సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి 1962లో హైదరాబాద్ వచ్చాశారు రామోజీ. 

చిట్ ఫండ్ వ్యాపారం..

రామోజీరావు(Ramoji Rao) 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు.  ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాఋ.  1967 - 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని చేశారు. 1969లో రామోజీరావు మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు.1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు.  దీని బాధ్యతలు ఆయన భార్య రమాదేవి చూసుకొనేవారు. 

ఈనాడు ఇలా..

తరువాత రామోజీరావు దృష్టి హోటల్ వ్యాపారం మీదికే మళ్లింది. 1970లో విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ నిర్మించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ వ్యాపారం ప్రారంభం అయ్యాకా 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రికను విశాఖ వేదికగానే ప్రారంభించారు. ఈనాడు ప్రారంభం నుంచి పాఠకుల ఆదరణతో దూసుకుపోయింది. అప్పట్లోనే వేగంగా వార్తలను.. కథనాలను తనదైన శైలిలో ఈనాడు తీసుకువచ్చేది. తన వ్యాపారాలన్నిటికన్నా ఎక్కువగా ఈనాడు పత్రికను రామోజీరావు విపరీతంగా అభిమానించేవారు. ఈ వ్యాపారాలు కొనసాగుతూ ఉండగానే 1980లో ప్రియా ఫుడ్స్ పేరుతొ ప్రియా పచ్చళ్ళను అందుబాటులోకి తెచ్చారు. చాలా తక్కువ కాలంలోనే ప్రియా పచ్చళ్ళు ప్రపంచ వ్యాప్తంగా పచ్చడి ప్రియులకు ఫేవరేట్ గా మారిపోయాయి. ఆ తరువాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ప్రారంభించి శ్రీవారికి ప్రేమలేఖ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఈలోపు టెలివిజన్ మీడియా రంగం వేళ్లూనుకోవడం ప్రారంభం అయింది. దీంతో రామోజీరావు ఈటీవీ మీటీవీ అంటూ ఛానల్ తెలుగు నాట మోత మోగించేలా తీసుకువచ్చారు. ప్రతి ఇంటిలోనూ ఈటీవీ సరాగాలు వినిపించేవి అంటే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ ఒక్కటే దిక్కుగా ఉన్న పరిస్థితుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టేలా ఈటీవీని తీర్చిదిద్దారు. ఈటీవీ న్యూస్ ఛానల్ తో వార్తావిశేషాలను ఇష్టపడే వారికీ మరింత దగ్గరైంది ఈటీవీ.

Also Read: రామోజీరావు ఇక లేరు

సినిమాల్లో.. 

ఇక సినిమా రంగంలోనూ రామోజీ ముద్ర తక్కువేమీ కాదు. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. రామోజీని ప్రపంచ వ్యాప్తంగా బలంగా పరిచయం చేసింది మాత్రం రామోజీ ఫిలిం సిటీ. 1996లో హైదరాబాద్ శివార్లలో దేశంలోనే అత్యున్నతమైన సాంకేతికతతో రామోజీ ఫిలిం సిటీని అందుబాటులోకి తీసుకువచ్చారు రామోజీరావు. స్క్రిప్ట్ పట్టుకుని సినిమా క్రూ ఫిలిం సిటీలోకి అడుగుపెడితే.. ఫస్ట్ కాపీ తీసుకుని బయటకు వచ్చేవరకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని రామోజీ కలకన్నారు. దానిని నెరవేర్చుకున్నారు. బాహుబలి లాంటి సినిమాలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. 

రాజకీయ మరకలు..

ఇక్కడ అప్రస్తుతమైనా.. రామోజీరావు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా చెప్పుకోవాలి. రామోజీరావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీని 9 నెలల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఈనాడు పత్రిక ద్వారా అందించిన సహకారం తక్కువేమీ కాదు. ఆ తరువాత రోజుల్లో కూడా.. తెలుగుదేశం పార్టీకి ఈనాడు పత్రిక కొమ్ము కాస్తుందని ప్రత్యర్ధులు విరుచుకుపడుతూనే ఉన్నారు. అయినా సరే, ఎక్కడా కూడా ఆ ముద్ర చెరుపుకునే ప్రయత్నం ఆయన చేయలేదని చెబుతారు. తెలుగు మీడియా రంగం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే, రామోజీరావు కృషి దానివెనుక ఎంతో ఉంది. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఔత్సాహిక జర్నలిస్టులను తయారు చేయడంలో రామోజీ పాత్ర చెప్పుకోదగ్గది. 

మొత్తంగా చూసుకుంటే రామోజీరావు తెలివైన వ్యాపారవేత్త. ఏ వ్యాపారం ప్రారంభించినా కచ్చితమైన లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పే పరిస్థితి కూడా ఉండదు. అందరికంటే ముందుగా పది సంవత్సరాల తరువాత ఎలాంటి వ్యాపారం టాప్ పొజిషన్లో ఉంటుందో అంచనా వేయగల సమర్థులు రామోజీరావు. వ్యాపారం చేయాలి.. దానిలో ఎదగాలి అనుకునేవారికి రామోజీ వ్యాపార జీవితం కచ్చితంగా స్ఫూర్తిదాయకమైనదే. రామోజీరావు మరణం మీడియా రంగానికే కాదు.. సినిమా రంగానికి.. వ్యాపార రంగానికి కూడా పెద్ద లోటే  అని చెప్పవచ్చు. 

#ramoji-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe