YCP MLA Rachamallu: కడప జిల్లా ప్రొద్దుటూరులో అసలేం జరగబోతుంది? వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? సీఐని బెదిరించిన రాచమల్లుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇలా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు బెదిరింపు కేసు సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది.ఈ ఘటనపై ఎస్పీ.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని విచారించారు. గతంలో రాచమల్లుపై నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యే ఆగ్రహం..
ప్రొద్దుటూరు వన్ టౌన్ లో ఎమ్మెల్యే రాచమల్లుపై మరో కేసు నమోదు అయింది. ఎమ్మెల్యేతో పాటు బామ్మర్ది బంగారు రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. నిన్న కొందరు వైసీపీ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అయితే, కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించడంతో సీఐపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ పోలీసులకు బెదిరింపు చర్యలు చేపట్టారు.
Also Read: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!
మరో తాడిపత్రి..
తమ కార్యకర్తలను వదిలి పెట్టకపోతే ప్రొద్దుటూరు మరో తాడిపత్రి చేస్తామంటూ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి సీఐని బెదిరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే తాట తీస్తామని సీఐ శ్రీకాంత్ హెచ్చరించారు. కౌన్సిలింగ్ కు పిలిపించిన కార్యకర్తలను వదిలిపెట్టకపోవడంతో ఎమ్మెల్యే స్టేషన్ కు చేరుకొని కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లారు.
ఎస్పీ సీరియస్..
దీంతో విధులకు ఆటంకం కలిగించి బెదిరింపులకు పాల్పడంపై పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేశారు సీఐ శ్రీకాంత్ యాదవ్. శ్రీకాంత్ పిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాచమల్లుపై మరో FIR నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని గతంలో నమోదైన కేసులపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యవేక్షించారు. సీఐని బెదిరించడాన్ని సీరియస్ గా పరిగణించిన ఎస్పీ.. ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల సంఘానికి ఎస్పీ నివేదిక అందించనున్నారు.