Congress: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రియాంక విముఖత..!

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఒక నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Congress: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రియాంక విముఖత..!
New Update

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఒక నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆమె భావిస్తున్నట్లు స‌మాచారం. ఇన్నాళ్లూ రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేస్తుందని భావించగా.. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి, రాయ్ బరేలి లోక్ సభ స్థానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయినప్పటికీ కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ తన నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఎంపీగా పోటీ చేసి ఒకే నియోజవర్గానికి పరిమితం కాకుండా దేశమంతా ప్రచారం నిర్వహిస్తే పార్టీకి మంచి ఫలితాలు అందుతాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్త పర్యటన కూడా ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

రాయ్ బరేలి స్థానం నుంచి ప్రియాంక గాంధీ తప్పుకుంటే అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రాయ్ బరేలి నుంచి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారని కూడా తెలుస్తోంది. అదే సమయంలో రాహుల్ గాంధీ పేరు కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఆయన రాయ్ బరేలి నుంచి పోటీలో ఉంటారని ప్రచారం కూడా జరుగుతోంది. అమేథి, రాయ్ బరేలి స్థానాల నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై 24 గంటల్లో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 5వ విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల సమర్పణకు మే 3 చివరి తేదీ. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు సాధ్యమైనంత తొందరగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. 

#priyanka-gandhi-vadra #not-contest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe