Polavaram Project: జీవనది గోదావరిపై నిర్మించతలపెట్టిన పెద్ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. దీనిని ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయనిగా భావిస్తారు. దానిలో మరో మాట కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగు నీరు ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి లోనూ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది మొదలు ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల కొరత, రాజకీయ కారణాలతో రోజులు గడుస్తున్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావడంలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది? అనే ప్రశ్నకు సమాధానమే దొరకడం లేదు.
పోలవరం ప్రాజెక్ట్ మౌలిక స్వరూపం ఇదీ..
ప్రధానంగా మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ను చెప్పవచ్చు.
- రిజర్వాయర్, 2. స్పిల్‌వే, 3. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వీటిలో మళ్ళీ కొన్ని ఉప విభాగాలు ఉన్నాయి.
రిజర్వాయర్:
వరదనీటిని నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్పిల్ వే:
రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు దీనిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ రెండు కొండల మధ్య నిర్మిస్తున్నారు. దీనికి మూతం 48 గేట్లు ఉంటాయి.
రెండు కాలువలు:
రిజర్వాయర్ కు కుడి, ఎడమ రెండు కాలువలు ఉంటాయి. నీటిని ఈ కాలువల ద్వారా దిగువకు వదులుతారు.
ఆనకట్ట:
ఇందులో అనేక భాగాలున్నాయి.
డయాఫ్రం వాల్..
ఇది నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ. నీరు లీకేజీ కాకుండా 2.454 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా రాతి, మట్టి కట్డడం (ఎర్త్-కం-రాక్ ఫిల్ డ్యాం) నిర్మిస్తారు.
కాఫర్ డ్యాం:
ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు పనులకు నీరు ఆటంకం కలిగించకుండా తాత్కాలికంగా నిర్మించే కట్టడం ఇది. దీనిని కాఫర్ డ్యామ్ అంటారు. పోలవరం కోసం రెండు కాఫర్ డ్యామ్‌లు ప్రతిపాదించారు. నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా ప్రాజెక్టుకు దిగువున ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు.
ప్రపంచంలోనే పెద్దది..
Polavaram Project: పోలవరం స్పిల్ వే 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు. చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే విధంగా ఉంది. కానీ.. దానికంటే ఎక్కువగా.. పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్‌ను రూపొందించారు. గత వందేళ్ల చరిత్రను ఆధారంగా ఈ స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు వందేళ్ళలో గోదావరికి 40లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని ఒక అంచనా. అందుకే మొదట్లో 36 లక్షల క్యూసెక్కుల డిశ్చారజ్ కెపాసిటీతో నిర్మించాలనుకున్న స్పిల్ వేను 50లక్షల క్యూసెక్కులకు పెంచేశారు. ప్రాజెక్టులోని ఒక్కో రేడియల్ గేటు 16మీటర్ల వెడల్పు, 20మీటర్ల పొడవు, 300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యం తో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ విశిష్ట ప్రయోజనాలు ఇవే..
- ఈ ప్రాజెక్టు పూర్తయితే, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
- విశాఖపట్నంలో కంపెనీలు, ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీరుస్తుంది
- విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందిస్తుంది
- కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.
జాతీయ ప్రాజెక్టుగా..
Polavaram Project: ఈ ప్రాజెక్టును 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీనికి 2013-14లో అంచనా వ్యయం 20,398.61 కోట్ల రూపాయలు. 2017-18 నాటికి అది 55,548.87 కోట్లకు చేరుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం మొదటి అంచనా 20,39.61 కోట్లు మాత్రమే తమకు సంబంధం అని 2016లో ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పునరావాసానికి 33,198.23 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. కేంద్రం అప్పట్లో పార్లమెట్ లో తెలిపిన దాని ప్రకారం ఈ ప్రాజెక్టు 2024 జూలై నాటికి పూర్తవ్వాలి.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
స్క్రీన్ వాల్: ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైన నిర్మాణం స్క్రీన్ వాల్. చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్ తో ఈ పనులు చేయించారు. నదీ గర్భంలోకి 70 మీటర్ల లోతు నుంచి ఈ విభజన గోడను నిర్మించాల్సి ఉంది. జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి కాపాడలేకపోయారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌లోని ఖాళీలను సకాలంలో పూరించనందున ఈ డయాఫ్రమ్ వాల్ 2020 వరదలో ధ్వంసమైంది. జాతీయ జలవిద్యుత్ పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు నిర్వహించింది. పాడైన ప్రదేశంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని, లేనిపక్షంలో కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని సూచించారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే బాగుంటుందని బాయర్ కంపెనీ పేర్కొంది. నిపుణులందరూ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుంది.
ఎగువ - దిగువ కాఫర్‌డ్యామ్‌లు: వీటి నిర్మాణం చంద్రబాబు హయాంలో కొన్ని పూర్తయితే తర్వాత కొన్ని పూర్తయ్యాయి. రెండూ (Polavaram Project)పూర్తయినప్పటికీ, దీనిలో లీకేజీ సమస్య తలెత్తింది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యామ్ నీటితో నిండిపోయే పరిస్థితి. వాటి నిర్మాణం విషయంలో నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకపోకుండా అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ తిరిగి నిర్మించాల్సిన పని ఉంది. ఇది పూర్తి చేయాలంటే రెండు సీజన్ల సమయం పడుతుంది. ఇది నిర్మాణం అయిన తరువాత.. ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఐదేళ్లు పడుతుంది. అది పూర్తి అయ్యే వరకూ ఈ కాఫర్‌డ్యామ్‌లు వరదలను తట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, అయితే ఇప్పుడు అవి లీక్‌లతో నిండిపోయాయి. నిపుణులు ఇప్పుడు ఏమి చెబుతారనేది చూడాల్సి ఉంది.
ప్రధాన ఆనకట్ట: మూడు భాగాలుగా పోలవరం ప్రధాన ఆనకట్టను(Polavaram Project)నిర్మిస్తున్నారు. ఇందులో చాలా పెద్ద ఆనకట్ట రెండో భాగం. మూడో భాగంలో కాంక్రీట్ డ్యాం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 565 మీటర్ల రాతి, భూమి నిర్మాణంలో భాగంగా మొదటి భాగంలో వైబ్రోస్టోన్ స్తంభాలు నిర్మాణం జరిగింది. పోలవరంలో గైడ్ లింక్ కూలిపోవడానికి గల కారణాలను కమిటీ తేల్చింది. ఒకే సీజన్లో కాకుండా వివిధ సీజన్లలో నిర్మాణం చేయడం వల్ల రాతి స్తంభాలు మురికిగా మారాయని, గైడ్ బ్యాండ్ పాడైందని కేంద్రం నియమించిన కమిటీ తెలిపింది. ఇప్పుడు ఈ ప్రధాన ఆనకట్ట మొదటి భాగంలో రాతి స్తంభాలు కూడా నిర్మించారు. ఆ తర్వాత వరదలు వచ్చాయి. మరి ఇప్పుడు ఇది ఎంతవరకూ పనికి వస్తుందనేది కూడా నిపుణులు తేల్చాలి
నీటి ప్రవాహ ఒత్తిడి వలన 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్పిల్‌వే కూలిపోయింది. డిజైన్ల ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదనే కారణం వినిపిస్తోంది. విభజన గోడలో 105 ప్యానెల్స్ ఉండగా 42 పాడైపోయాయని కమిటీ నిర్ధారించింది. ఈ నిర్మాణం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను నిర్ణయించాల్సి ఉంది.
ఇక ప్రధాన ఆనకట్ట నిర్మించిన చోట పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. 2020 వరదల సమయంలో ఎగువ కాఫర్‌డ్యామ్‌లోని ఖాళీల మీదుగా భారీ వరద ప్రవాహం వలన ఇలా జరిగింది. దీంతో అక్కడి భౌగోళిక పరిస్థితులు మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రతను పెంచేందుకు వైబ్రో కంపాక్షన్ పనులు చేపడతారు. మధ్యలో మరో వరద రావడంతో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. ఈ పరిస్థితిని కూడా నిపుణులు పరిష్కరించే పని చేయాల్సి ఉంది.
నిధుల గొడవ..
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కు ముఖ్య అడ్డంగి నిధులు. ఇప్పటివరకూ నిధుల విషయంలో కేంద్రం రకరకాల మాటలు చెబుతూ వచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ రెండో డీపీఆర్‌ను కేంద్రం ఇంతవరకు మంజూరు చేయలేదు. గతంలో చంద్రబాబు హయాంలో కేంద్ర జలసంఘ్ రూ.55,656 కోట్లకు ఆమోదం తెలిపింది. తదనంతరం, సవరించిన వ్యయ కమిటీ రూ.47,725.74 కోట్లు సిఫార్సు చేసింది. కానీ, కేంద్రం నుంచి నిధులు మంజూరు కాలేదు. మరోవైపు జగన్ హయాంలో 41.15 మీటర్ల లెవల్ పునరుద్ధరణ, భూసేకరణ, భవనాలు, కాలువల వారీగా ఉన్న పరిస్థితికి రూ.31,625 కోట్లు కేటాయించాలని కేంద్ర జలమండలి సిఫార్సు చేసింది. ఈ పరిస్థితిలో నిధులను ఎలా సమీకరిస్తారు? కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుంది? ఇవన్నీ ప్రశ్నలే.
ఏపీకి మళ్ళీ సీఎం గా చంద్రబాబు నాయుడు వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ తన టాప్ ప్రియారిటీ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రాజెక్ట్ ను సందర్సించి పనులపై సమీక్ష కూడా చేస్తున్నారు. ఈ సమీక్షలు పూర్తయిన తరువాత. ప్రాజెక్ట్ ఇప్పటి సరైన పరిస్థితిపై ఒక అంచనా వచ్చే అవకాశం వుంది. తరువాత ఎంత నిధులు అవసరం అవుతాయి? వాటిని ఎలా సమీకరిస్తారు? కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాల్సి ఉంది.