భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం ప్రాణాలు తీసింది. దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అటవీ భూముల్లో సాగు చేసేందుకు పోడు రైతుల ప్రయత్నం చేయగా.. అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఇంతలోనే అటవీ భూముల్లో చెట్లను నరికేందుకు పోడు రైతుల ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తిరుపతమ్మ అనే మహిళ మృతి చెందింది. తిరుపతమ్మ మృతితో నాగులపల్లిలో విషాదం నెలకొంది.
నిత్యం ఏదో ఒక చోట వివాదాలు:
పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం ములుగు జిల్లాల్లోనూ అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో అటవీ భూములపై వివాదం రాజుకుంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో అటవీశాఖ అధికారులు.. తమ భూములు సాగు చేయకుండా అడ్డుకుంటున్నరని ఆరోపించారు. తమకు జీవనాధారమైన పొలాలను లాక్కునేందుకు ప్రయత్నించటం సరికాదన్నారు.
ఎడతెగని వివాదం:
అటు సత్తుపల్లిలో పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య చాలా కాలంగా నానుతున్న సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడడం లేదని రైతులు చెబుతుండగా.. అటవీశాఖ అధికారులు మాత్రం అక్రమంగా సాగు చేస్తున్నారని అడ్డుకుంటూ వస్తున్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని గుడిపాడు కాలనీలో పోడు కొట్టి సాగు చేసుకుంటున్నామని, పలుమార్లు అటవీ అధికారులు తమ సాగును ధ్వంసం చేయడంతో ఏటా ఇదే పరిస్థితి ఉంటోందని పోడుసాగుదారులు వాపోతున్నారు. తమకు ఇక్కడ 45ఎకరాల్లో పట్టాలు ఇవ్వగా మరో 25ఎకరాలకు పట్టాలు ఇవ్వకుండా అధికారులు అడ్డు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
ALSO READ: ప్రైవేట్ జెట్‌లో మంటలు.. రన్‌వే స్కిడ్.. 8 మంది ప్రయాణికులు!