Pithapuram: ఏ పార్టీ గెలిచినా పవర్ సెంటర్ పిఠాపురమే! ఎందుకో తెలుసా.. మొన్నటి వరకూ పెద్దగా ఎవరికీ తెలియని పేరు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోతున్న ఊరు పిఠాపురం. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీచేయడంతోనే దశ మారింది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పిఠాపురం అధికార కేంద్రంగా మారుతుంది. ఎలానో తెలియాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే. By KVD Varma 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి మొన్నటి వరకూ అది ఒక సిటీ పేరు చెప్పి చెప్పాల్సిన ఎడ్రస్.. నిన్నటి వరకూ అది ఒక చిన్న ఊరు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా వినపడుతున్న పేరు. అదే ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం(Pithapuram). ఎప్పుడో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కానీ.. వినపడని పేరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. ఇలా ఎందుకో అందరికీ తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేయడమే. ఆ ఒక్క కారణమే పిఠాపురాన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షించేలా చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలున్నాయి.. పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఊగిపోయే అభిమాన గణం.. ప్రాణమిచ్చి పనిచేసే జనసైనికులు ఉన్న నియోజకవర్గాలు కోస్తా ప్రాంతంలో చాలా ఉన్నాయి.. కానీ, ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక ఆయనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు కూడా తక్కువ కాదు. అలా ఎందుకు చేశారు? వీటిని మించి ప్రచార పర్వం ముగిసి ఎన్నికల వేళకు పిఠాపురం(Pithapuram) మరింతగా అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా.. రాష్ట్ర రాజకీయాలకు.. అధికార కేంద్రంగా మారిపోయింది. అలా ఎందుకు జరిగింది? ఒక లుక్ వేద్దాం.. పవన్ కళ్యాణ్.. పిఠాపురం.. జనసేనాని బలం అభిమానులు అయితే.. మరో పెద్ద బలం సామాజిక వర్గం. కొంత విబేధాలు.. లుకలుకలు ఉన్నాసరే.. కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కి పెద్ద సైన్యమే ఉంది. అందులోనూ కోస్తా జిల్లాల్లో ఈ సామాజిక వర్గంలో మెజార్టీ వర్గం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది. ఇక పిఠాపురం(Pithapuram)లో కాపు సామాజిక వర్గం బలం చాలా ఎక్కువ. ఇక కాపులతో పాటు, బీసీ ఇతర వెనుకబడిన వర్గాల్లోనూ జనసేనాని అభిమాన గణం చెప్పుకోదగ్గ విధంగానే ఉంది. పిఠాపురంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ఓటు బ్యాంకు ఇది. ఈ సామాజిక లెక్కలతోనే.. పవన్ కళ్యాణ్ ఏరి కోరి పిఠాపురం ఎంచుకున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉండడం మరో కారణంగా చెప్పవచ్చు. అక్కడ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈయనకు ఉన్న ఆదరణ.. సామాజిక లెక్కలు అన్నీ చూసుకుంటే.. తన గెలుపు నల్లేరుపై నడకే అనే అంచనా పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుంచి పోటీకి దిగేలా చేసింది. నిరసన తెలిపినా.. చివరికి జై కొట్టారు.. పవన్ పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేస్తున్నారు అనగానే వర్మ నుంచి తీవ్ర వ్యతిరేకత సహజంగానే వచ్చింది. అయితే, సరైన సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను బుజ్జగించారు. తెర వెనుక ఆయనకు ఏమి చెప్పారనేది వదిలేస్తే.. వర్మ కూడా మెత్త పడ్డారు. తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మద్దతు కోరారు. దీంతో వర్మ అన్నీ తానై ప్రచారంలో పవన్ కు సహకరించారు. వైసీపీ ఉలిక్కిపాటు.. పవన్ పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం ఎంచుకున్న వెంటనే, వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. సీఎం జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా అనేకంటే, తన పులివెందుల కంటే ఎక్కువగా అని చెప్పడం సబబుగా ఉంటుంది. అక్కడ వంగ గీతను పోటీలో నిలబెట్టారు. ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉండేలా పార్టీకి చెందిన మిధున్ రెడ్డి వంటి పోల్ మేనేజ్ చేయగలిగే వారిని రంగంలోకి దింపారు. ఎలాగైనా పవన్ ఓడించడం అనే కాన్సెప్ట్ తో ప్రచారం చేశారు. Also Read: సీఏఏ రద్దు సాధ్యం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ ప్రచారంలో పోటాపోటీ.. ప్రచార పర్వంలో పవన్ కళ్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీలో చాలామంది స్వచ్చందంగా తరలి వచ్చారు. ముఖ్యంగా జబర్దస్త్ టీమ్ మొత్తం పిఠాపురం(Pithapuram)లో నెలరోజులు పైగా మకాం వేసింది. ఇక చిరంజీవి పవన్ కు మద్దతుగా ట్వీట్ చేయడం.. చివరి క్షణాల్లో రామ్ చరణ్ ప్రచారం పవన్ కు అప్పటికే ఉన్న హైప్ మరింత పెరిగేలా చేశాయి. మరోవైపు వైసీపీ కూడా ఏమాత్రం తగ్గలేదు. సినీ గ్లామర్ లేకపోయినా.. వైసీపీ నాయకులంతా వంగా గీతకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ప్రచారం చివరి రోజు ముఖ్యమంత్రి జగన్ అక్కడ సంచలనమే సృష్టించారు. పిఠాపురం(Pithapuram)లో వంగా గీతను గెలిపిస్తే.. తమ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఆమెకు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురం రేంజ్ మారిపోయింది. పిఠాపురం దశ తిరిగినట్టే.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఓటరు తీర్పు భద్రంగా ఉంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఈలోపు అందరి అంచనాలు పవన్ కళ్యాణ్ గెలుస్తారనే ఉన్నాయి. మరోవైపు వంగా గీతకు కూడా గెలుపు అవకాశాలున్నాయని చాలా సర్వేలు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే, ఎవరు గెలిచినా పిఠాపురం దశ తిరిగినట్టే అని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గెలిచి.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వంలో కీలకమైన పదవిలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటారు. అప్పుడు పిఠాపురం అభివృద్ధి విషయంలో ఎటువంటి అనుమానమూ అక్కర్లేదు. ఒకవేళ వంగా గీత గెలిచి.. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ ఆమె డిప్యూటీ సీఎం ఉన్నట్లు. అప్పుడు కూడా అధికార కేంద్రంగా పిఠాపురం(Pithapuram) ఉంటుంది. ఈ రెండు కాకుండా సీన్ రివర్స్ లో జరిగితే.. అంటే పవన్ గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా పిఠాపురం అభివృద్ధి విషయంలో పవన్ గట్టిగా నిలబడగలుగుతారు. ఎందుకంటే, బీజేపీ నుంచి అందండలు పుష్కలంగా పవన్ తో ఉంటాయనేది సుస్పష్టం. అలాకాకుండా.. వంగా గీత గెలిచి.. టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం కొద్దిగా అభివృద్ధి విషయంలో క్లిష్టంగా ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ ఎన్నిలతో పిఠాపురం ఏపీ ఇటు రాజకీయంగానూ.. అటు అధికార పరంగానూ కేంద్ర బిందువుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఎవరు ఓటమి పాలైనా.. ఇప్పుడు పిఠాపురం పేరు ఆంధ్ర రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గంగా మిగులుతుంది. #pithapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి