కొన్నేళ్లుగా చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించేవారి సంఖ్య బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య క్రమక్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నట్టుండి ప్రజలు కుప్పకూలుతుండడం కలవర పెడుతోంది. గతంలో పెద్ద వయసు వారికే ఎక్కువగా గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు టీనేజ్ పిల్లలు, యువతను కూడా గుండెపోటు మింగేస్తోంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ కనిపించిన వారు క్షణం వ్యవధిలో కుప్పకూలుతున్నారు. తాజాగా తెలంగాణలో మరోసారి అదే జరిగింది.
డ్యాన్స్ చేస్తుండగా మృతి:
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదకర ఘటన జరిగింది. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ విజయ్ కుమార్ అనే యువకుడు కుప్పకూలాడు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. విజయ్ కుమార్ మృతితో పెండ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పటివరకు ఆనందంగా అందరితో మాట్లాడిన విజయ్ ఇక లేడన్న చేదు నిజాన్ని అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మ్యూజిక్ వల్లేనా?
డీజే బిగ్గరగా వినిపించడం వల్ల గుండెపోటు వచ్చి మరణిస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 2019లో, హార్వర్డ్ ఎడ్యుకేషన్ చేసిన ఓ అధ్యయనం యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించారు. సంగీతం లేదా ఏదైనా రకమైన పెద్ద శబ్దం గుండెను ఎలా బలహీనపరుస్తుందో ఇందులో వివరించారు. 500 మంది పెద్దల హృదయాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరు రద్దీగా ఉండే రోడ్ల దగ్గర నివసించే లేదా పని చేసే వ్యక్తులు. ఇక్కడ వాహనాల శబ్దం పగలు, రాత్రి ప్రతిధ్వనిస్తుంది. వీరందరికి హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలింది. రోజులో ప్రతి 5 డెసిబెల్ పెరుగుదలకు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 34శాతం పెరుగుతుంది. ఇది మెదడులోని అమిగ్డాలాను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగాలకు సంబంధించిన భాగం ఇది. దీర్ఘకాలిక శబ్దం బహిర్గతం కారణంగా ఈ భాగం ఎఫెక్ట్ అవుతుంది. ఇది మానసిక కల్లోలం లాంటి సమస్యలకు దారితీస్తుంది.