TDP-JSP: టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై ఆ పార్టీలో చర్చ ఊపందుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీతో పొత్తు-సీట్లు అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీట్ల విషయంలో మనం వెనక్కి తగ్గొద్దని జనసేన నేతలు పవన్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత 40 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ మైలేజ్ తగ్గిందనీ, అదే సమయంలో వారాహి యాత్రతో జనసేన క్రేజ్ భారీగా పెరిగిందనీ, ఇలాంటి సమయంలో సీట్ల విషయంలో జనసేన రాజీ పడాల్సిన అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ వద్ద పార్టీ నేతలు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే, గతంలో 30 సీట్ల దాకా ఉన్న అంచనాలు ప్రస్తుతం టీడీపీకి మైలేజ్ తగ్గిన పరిస్థితుల్లో మరింతగా పెరుగుతున్నాయి. కనీసం 50 సీట్లకు తగ్గకూడదని జనసేన నేతల నుండి డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడిగా అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఎలా ఉండాలన్న దానిపై మాజీ హోం మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ అంశాలను కూడా జనసేన నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
సీన్ మారని టీడీపీ:
స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలన్నర రోజులుగా రిమాండ్‌కే పరిమితమయ్యారు. కింది కోర్టుల నుండి, హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఊరట దక్కే అవకాశం ఉన్నా.. తీర్పు ఆలస్యమవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా కొలిక్కి వస్తుందనుకున్న సుప్రీం కోర్టులోని క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మరో 20 రోజులైనా చంద్రబాబు జైలుకే పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్న తరుణంలో సీట్ల లెక్కలు క్లియర్ కట్ గా తేల్చుకోవాలన్న ఒత్తిడి పవన్‌కు పార్టీ నేతల నుండి ఎదురవుతోంది.
23న జేఏసీ మీటింగ్:
టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల సమన్వయ కమిటీల తొలి సమావేశం ఈ నెల 23న జరగనున్నట్లు ఇరు పార్టీ వర్గాల సమాచారం. అయితే టీడీపీ, జనసేన రెండు పార్టీలలో ఏ పార్టీ కూడా ఈ సమావేశాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. రాజమండ్రిలో 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నుండి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించిన సంగతి విధితమే.