Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి పట్ల తనకేమీ విముఖత లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం పదవి వరిస్తే.. తీసుకోవడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటున్నారు. పవన్ చేసిన ఈ కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే సీట్ల విషయంలో పట్టు బిగించాల్సిందే అంటూ జనసేన నేతల నుండి ఒత్తిడి వస్తుండగా.. సీఎం పదవి విషయంలోనూ పవన్ వెనక్కి తగ్గొద్దని ఆ పార్టీ సీనియర్లు సూచిస్తున్నారట. అయితే పవన్ మాత్రం నిన్న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని గద్దె దించడమే తమకు అన్నికంటే ముఖ్యమని చెప్పారు. ఏపీలో రానున్నది సంకీర్ణ సర్కారేనని, టీడీపీతో ఒకటి రెండు చోట్ల విభేదాలున్నా సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు.
Also Read: మీ అజమాయిషీ పనికిరాదు..మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్..!!
టీడీపీతో అలయెన్స్‌కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవి పట్ల విముఖంగా ఏమీ లేనన్నారు. సీఎం పదవి వరిస్తే.. చేపట్టడానికి తాను సిద్ధంగానే ఉన్నానని, కానీ దాని కోసం ఎప్పుడూ వెంపర్లాడనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించడమే తమకు ముఖ్యమని తెలిపారు. ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యమని చెప్పారు. అందుకోసం ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం తీసుకొస్తామన్న పవన్.. టీడీపీ నేతలతో ఎక్కడైనా విభేదాలుంటే.. వాటిని సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామన్నారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి ముందుకెళ్లాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
Also Read: నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా? 8న క్వాష్ తీర్పు? – తెలకపల్లి రవి
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల భవిష్యత్ కోసమే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుకు తమ పార్టీలో అందరూ సమర్థించారనీ, అలాగే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పొత్తు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి తమ పార్టీలోని క్రియాశీలక సభ్యుల అభిప్రాయాలను నివేదక రూపంలో తీసుకున్నట్లు పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్ధుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. జనసేన 150 మంది క్రియాశీల సభ్యులతో ప్రారంభమైందనీ, నేడు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఒకరి అండదండలతో కాకుండా సొంతంగా జనసేన బలోపేతం అయినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఖచ్చితంగా టీడీపీ-జనసేన పొత్తుతోనే ముందుకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.