ఒక సబ్జెక్ట్, లేదా రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో చదువు మానేసిన వారు అనేక మంది ఉంటారు. ముఖ్యంగా డిగ్రీ దశలో ఇలాంటి కారణంతో చాలా మంది ఉన్నత చదువుకు దూరం అవుతారు. అయితే.. ఏదో ఓ సమయంలో చదివి పట్టభద్రులం కావాలన్న కోరిక కలిగినా.. కోర్సు పూర్తి చేసే గడువు ముగిసిందని తెలిసి బాధ పడుతుంటారు. ఇలాంటి వారికి ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) శుభవార్త చెప్పింది. తమ యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ చదివి ఫెయిలయిన స్టూడెంట్స్ కు పరీక్షలు రాసేందుకు మళ్లీ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Indian Army College: మీ బిడ్డ ఇక్కడ అడ్మిషన్ సాధిస్తే, సైన్యంలో అధికారి కావడం ఖాయం!
2000 నుంచి 2019 వరకు యూనివర్సిటీ పరిధిలో వరకు బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు చదివి ఉత్తీర్ణత సాధించని వారికి ఈ అవకాశం ఉంటుంది. ఆయా విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించి పరీక్ష రాసే అవకాశం పొందొచ్చు. ఆ తర్వాత 22 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించొచ్చు.
అయితే.. గతంలో ఇలాంటి అవకాశం కల్పించిన సమయంలో ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేల వరకు ఫీజు ఉండేది. అయితే.. ఈ సారి రూ.2 వేలకు తగ్గించింది ఉస్మానియా యూనివర్సిటీ. విద్యార్థులు ఇతర పూర్తి పూర్తి వివరాలకు https://www.osmania.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.