Old Indian Parliament History: భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం పాత పార్లమెంటు భవనం(Old Parliament building).. బ్రిటీష్ పాలకుల గుండెల్లో పిడుగై పడ్డ భగత్‌సింగ్(Bhagat singh) బాంబులకు అడ్డా ఈ భవనం.. దేశ రాజధాని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మారడానికి కారణమైన భవనం కూడా ఇదే..! స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన చారిత్రాత్మక 'ట్రిస్ట్ విత్ డెస్టినీ(tryst with destiny)' ప్రసంగంతో దేశం పునర్జన్మ పొందింది. బానిస సంకేళ్లను తెంచుకుంటూ స్వేచ్ఛ ప్రపంచంలోకి ఇండియా అడుగుపెట్టిన తొలి రోజు నుంచి దేశాన్ని ముందుండి నడిపిస్తోన్న పాత పార్లమెంట్ భవనానికి భారత్ అధికారికంగా వీడ్కోలు పలికింది. కొత్త పార్లమెంట్ భవనం నుంచే ఇకపై దేశం ముందడుగులు వేయనుంది. ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపి అనుభూతులు.. చేదు ఘటనలు.. బాంబు దాడులు.. నిరసనలు.. గొడవలు.. కొట్లాటలు..ఇలా పాత పార్లమెంట్‌లో జరిగిన ప్రతీ విషయాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కొత్త ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఒకవైపు ఉంటే పుట్టి పెరిగిన ఇంటిని వదిలేస్తున్నామన్న బాధ మరోవైపు ఉన్నట్టు అనిపించకమానదు.
ఎప్పుడు మొదలైంది?
అది ఫిబ్రవరి 12, 1921.. పాత పార్లమెంట్ భవనానికి పునాది రాళ్లు పడిన రోజు. బ్రిటన్ డ్యూక్ ఆఫ్ కన్నాట్ ఫౌండెషన్ స్టోన్ వేశారు. కోల్‌కతా నుంచి ఢిల్లీకి పాలన క్రమక్రమంగా మారుతున్న రోజులవి. స్వాతంత్ర్యం కోసం గాంధీ అహింస మార్గంవైపు బ్రిటీష్ పాలకులను ఢీకొడుతున్న కాలం అది. ఓవైపు స్వాత్రంత్ర్య పోరాటం జరుగుతుండగానే మరోవైపు పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ బిల్డింగ్ పనులు పూర్తి కావడానికి ఆరేళ్లు పట్టింది. 1927లో జనవరి 18న అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ భారత పార్లమెంట్‌ను ప్రారంభించారు. బ్రిటీష్ శిల్పులు ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ ఈ పారిపాలనా బిల్డింగ్ నిర్మాణానికి సారధ్యం వహించారు.
1950లో అధికారికంగా భారత్ అడుగు:
మొదట ఈ బిల్డింగ్‌ను హౌస్ ఆఫ్ పార్లమెంట్ అని పిలిచేవారు. పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్, వృత్తాకారంతో పాటు 98 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని ఇక్కడే రూపొందించారు. మన దేశ రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి. మొదటి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఏప్రిల్ 1952లో అడుగుపెట్టారు. ఆరు ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే విలక్షణమైన కట్టడం ఇది.
ఎన్నో ఫీచర్లు:
సంసద్ మార్గ్ చివరన ఉన్న పార్లమెంటు లేదా సంసద్ భవన్‌లో లోక్ సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉన్నాయి. ఈ మూడు గదుల మధ్య ఒక తోట కూడా ఉంది. ఈ భవనంలో మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ ముఖ్య అధికారులు, చైర్మన్లు, పార్లమెంటరీ కమిటీలకు వసతి కల్పిస్తారు. 1956లో ఈ పాత పార్లమెంటు భవనానికి రెండు అంతస్తులను జోడించారు. 2,500 సంవత్సరాలకు పైగా పురాతనమైన భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆలోచనతో పార్లమెంటు మ్యూజియాన్ని 2006లో స్థాపించారు. ఈ మ్యూజియంలో సౌండ్ అండ్ లైట్ వీడియోలు, పెద్ద స్క్రీన్ ఇంటరాక్టివ్ కంప్యూటర్ స్క్రీన్లు, వర్చువల్ రియాలిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
భగత్‌సింగ్ విప్లవ పోరాటానికి చిహ్నం:
స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో భగన్‌సింగ్ రిగిల్చిన పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం పాత పార్లమెంట్ భవనం. 1929లో ఏప్రిల్ 8న విప్లవకారులు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లతో బ్రిటిష్ రాజ్ హయాంలోని పాత పార్లమెంటు చాంబర్లు వణికిపోయాయి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) నుంచి 'చెవిటివారికి వినిపించడానికి పెద్ద గొంతు కావాలి'(‘It takes a loud voice to make the deaf hear’) అనే సందేశంతో విజిటర్స్ గ్యాలరీల నుంచి ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఎర్ర కరపత్రాలను విసిరారు. సర్ జాన్ ఆల్సెబ్రూక్ సైమన్ ఛాంబర్‌లో ఉన్న సమయంలో భగత్‌సింగ్, దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. సైమన్ కమిషన్‌కు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో 'సైమన్ గో బ్యాక్' ఆ సమయంలో భారత్‌కు ఉద్యమ నినాదం. నిజానికి సైమన్‌పై దాడి చేయలన్నది భగత్‌సింగ్ ఉద్దేశం కాదు. ప్రజలను మేల్కొలపాలన్నదే ఆయన ఆలోచన. ఈ ఘటన తర్వాత భగత్‌సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు. పాలనా వ్యవస్థను మార్చడానికి ఇది ప్రభుత్వానికి ప్రమాద సంకేతం మాత్రమేనని పత్రికలు విప్లవకారులను కీర్తించాయి. తమ ఉద్యమాన్ని, భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ట్రయల్ కోర్టును ప్రచార వేదికగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భగత్‌సింగ్ అమరుడయ్యాడు.
పార్లమెంట్‌పై దాడి:
రాజ్యాంగ సవరణల నుంచి కొత్త చట్టాల అమల వరకు దేశం మొత్తాన్ని నడిపించిన పాత పార్లమెంట్ భవనం ఉగ్రదాడులను కూడా భరించింది. డిసెంబర్ 13, 2001న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్టిక్కర్లతో కూడిన వైట్ అంబాసిడర్‌లలో భారత పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించాయి. ఏకే-47 ఆయుధాలు, గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, హ్యాండ్ గన్లతో ఉగ్రవాదులు భద్రతా బందోబస్తును ఛేదించారు. ఎంపీలందరూ సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ, ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా అధికారులు సహా తొమ్మిది మంది మరణించారు. 18 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి దుస్తులు ధరించిన దుండగుల్లో ఒకరిని కాల్చి చంపిన తర్వాత అతని బాంబు పేలడంతో అతడు మృతి చెందాడు. మరో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. దేశ అత్యున్నత రాజకీయ నాయకత్వాన్ని తుడిచిపెట్టేందుకే ఈ దాడి జరిగిందని అప్పటి హోం మంత్రి ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించారు.
భవన సమస్యలు:
2012లో నాటి లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ పార్లమెంట్ భవనం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భవనంలో లీకేజీ, ప్లంబింగ్ సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని 2018లో సుమిత్రా మహాజన్ పునరుద్ఘాటించారు. దీనిపై మహాజన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.. ఇక అప్పటినుంచి కొత్త పార్లమెంట్ నిర్మాణంవైపు శరవేగంగా అడుగులు పడ్డాయి. 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ కొత్త పార్లమెంటుకు భూమిపూజ చేశారు. ఈ ఏడాది మేలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఇవాళ్టి(సెప్టెంబర్18)తో పాత పార్లమెంట్ భవనానికి బై బై చెబుతూ మోదీ ప్రసంగించారు. నెహ్రూ స్పీచ్ నుంచి వాజ్‌పాయ్ ప్రసంగం వరకు కీలక పరిణామాలను గుర్తు చేసుకున్న మోదీ పాత పార్లమెంట్ బల్డింగ్‌కు సెండ్ ఆఫ్ ఇచ్చారు.
స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత తొమ్మిదిన్నర దశాబ్దాలకు పైగా దేశ భవితవ్యాన్ని నిర్దేశించిన చారిత్రక మైలురాయి పాత పార్లమెంట్ భవనం.. నిర్మాణ వైభవానికి మాత్రమే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం కూడా.. అందుకే ఇది దేవాలయం!
ALSO READ: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు