సమాజ్ వాది పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇజం అనేది ఒక మతం కాదన్నారు. అది ఒక పెద్ద బూటకమని ఆయన మండిపడ్డారు. హిందూయిజాన్ని బ్రహ్మణ మతంగా పిలవాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
స్వామి ప్రసాద్ మౌర్య తన ట్వీట్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన ‘హిందూయిజం అనే పిలవడే మతమేది లేదన్నారు. హిందూయిజం అనేది పెద్ద బూటకమని ఫైర్ అయ్యారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారిని ట్రాప్ చేసేందుకు చేసిన పెద్ద కుట్ర అని మండిపడ్డారు.
బ్రహ్మణిజం మూలాలు చాలా లోతుగా వున్నాయని పేర్కొన్నారు. ఆ బ్రహ్మణిజాన్నే హిందూ మతంగా పిలుస్తున్నారని వెల్లడించారు. హిందూయిజం అనే మతం వుంటే ఈ దేశంలోని ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన కులాల వారికి గౌరవం లభించేదన్నారు. గతంలో రామచరిత మానస్ పై స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
రామ చరిత మానస్ లోని కొన్ని శ్లోకాలు కుల ప్రాతి పదికన ఓ వర్గాన్ని అవమానపరుస్తున్నాయని ఆరోపించారు. అందువల్ల రామ చరిత మానస్ పై నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. మతం పేరిట ఒక కులాన్ని విమర్శించడం ఆక్షేపించదగినదని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజలు రామచరిత మానస్ ను చదవలేదని ఆయన చెప్పారు.