Skeet Shooting: భారత స్కీట్ షూటర్ల సరికొత్త రికార్డ్! By Durga Rao 29 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి పారిస్ ఒలింపిక్స్ అర్హత షూటింగ్ పోటీలలో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మరో ఎనిమిదివారాలలో ప్రారంభమయ్యే 2024 ఒలింపిక్స్ షూటింగ్ పతకాలకు భారత షూటర్లు గురిపెట్టారు. పురుషుల, మహిళల వివిధ విభాగాలలో మొత్తం 24 బెర్త్ లకు గాను..ఇప్పటికే భారత షూటర్లు 21 బెర్త్ లు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు. పిస్టల్, రైఫిల్ షూటింగ్ విభాగాలలో భారత యువషూటర్లు స్థాయికి మించి రాణిస్తూ పతకం ఆశలు రేపుతున్నారు. తొలిసారిగా స్కీట్ షూటర్ల అర్హత.. గాలిలో ఎగురుతున్న లక్ష్యాలను చేధించే స్కీట్ షూటింగ్ విభాగంలో భారత మహిళా షూటర్లు ఇద్దరు తొలిసారిగా అర్హత సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. నూరేళ్లకు పైబడిన ఒలింపిక్స్ చరిత్రలోనే మహిళల స్కీట్ షూటింగ్ కు భారత షూటర్లు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఖతర్ లోని దోహా వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత షూటింగ్ మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్ మహేశ్వరీ చౌహాన్ ఫైనల్స్ చేరుకోడం ద్వారా పారిస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. తాతా ప్రేరణతో.. రాజస్థాన్ లోని జలోర్ జిల్లా సైనా గ్రామంలో తన తాతా ధన్ పత్ సింగ్ చౌహాన్ సొంతంగా ఏర్పాటు చేసిన చిన్నషూటింగ్ రేంజ్ లో సాధన చేస్తూ ఎదిగిన 27 సంవత్సరాల మహేశ్వరి తన జీవితలక్ష్యం ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా నెరవేర్చుకోగలిగింది. వివిధ దేశాలకు చెందిన మొత్తం ఆరుగురు మేటి షూటర్ల నడుమ జరిగిన ఈ పోరులో చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా చాడిడ్, మహేశ్వరీ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా స్వర్ణ, రజత పతకాలతో పాటు..ఒలింపిక్స్ బెర్త్ లు సైతం సంపాదించగలిగారు. 14 ఏళ్ళ తరువాత స్వర్ణం! ఈ ఇద్దరు షూటర్లు చెరో 54 పాయింట్లు చొప్పున సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలవడంతో షూటౌట్ నిర్వహించారు. ఇందులో మహేశ్వరీ సఫలం కాలేకపోడంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా షూటర్ ఇటింగ్ జియాంగ్ కాంస్య పతకం సాధించింది. స్వీడన్ షూటర్ విక్టోరియా లార్సన్ 4వ స్థానంతో సరిపెట్టుకొంది. మహిళల స్కీట్ షూటింగ్ ఒలింపిక్స్ తొలి బెర్త్ ను భారత్ కే చెందిన రియాజా ధిల్లాన్ గతంలోనే సాధించగా..ప్రస్తుత పోటీల ద్వారా మహేశ్వరీ చౌహాన్ సైతం రెండో బెర్త్ ను కైవసం చేసుకోగలిగింది. ఒలింపిక్స్ బెర్త్ కోసం గత కొద్దిమాసాలుగా తాను తీవ్రంగా శ్రమించానని, తాత లక్ష్యం సగం మాత్రమే నెరవేర్చానని, ఒలింపిక్స్ లో పతకం సాధించగలిగితే అది పరిపూర్ణమవుతుందని మహేశ్వరి చెబుతోంది. ఇదే టోర్నీలో పాల్గొన్న భారత ఇతర షూటర్లు గనమత్ షెకాన్ 24, అరీబా ఖాన్ 47 స్థానాలలో నిలవడం ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయారు. 24కు 21 బెర్త్ లు భారత్ కైవసం.. ఒలింపిక్స్ షూటింగ్ లో ఏ దేశానికైనా 24 విభాగాలలో మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉంటుంది. భారత షూటర్లు మొత్తం 24కి 21 బెర్త్ లను సొంతం చేసుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒలింపిక్స్ షూటింగ్ చరిత్రలో భారత్ ఇన్ని విభాగాలలో అర్హత సాధించడం ఇదే మొదటిసారి. పురుషుల ట్రాప్ విభాగంలో బౌనీశ్ మెండీరట్టా, మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరీ కుమారీ, మహిళల స్కీట్ విభాగంలో రియాజా ధిల్లాన్, మహేశ్వరీ చౌహాన్, పురుషుల స్కీట్ విభాగంలో అనంతజీత్ సింగ్ నరూకా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు సంపాదించగలిగారు. పురుషుల స్కీట్ షూటింగ్ అర్హత పోటీలలో మైరాజ్ అహ్మద్ ఖాన్, అంగత్ వీర్ సింగ్ బావా, షిరాజ్ షేక్ తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు. రెఫిల్, పిస్టల్ విభాగాలలో తమ కేటాయించిన ఎనిమిదేసి ఒలింపిక్ బెర్త్ లను భారత షూటర్లు సాధించగలిగారు. టోక్యో ఒలింపిక్స్ లో 15 బెర్త్ లు మాత్రమే సాధించిన భారత షూటర్లు..పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో 21 బెర్త్ లు సాధించడం అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది. పారిస్ ఒలింపిక్స్ జులై నెలలో ప్రారంభంకానున్నాయి. #skeet-shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి